ఒకే చోట 24 లక్షల బంతులు... అతిపెద్ద బాల్ పిట్ ఎక్కడో తెలుసా?
హాయ్ నేస్తాలూ! బంతులతో ఆడుకోవడం అంటే మనకు భలే సరదా కదూ! అలాంటిది కొన్ని వేల
బంతులన్నీ ఒకే చోట ఉండి.. వాటితో ఆడుకోమంటే ఇక మన సంతోషానికి హద్దు ఉండదు. మరి
ఇంతకీ అన్ని బంతులు ఒకే చోట ఎక్కడ, ఎందుకు ఉన్నాయో తెలుసుకుందామా!
మీకు బాల్ పిట్ అంటే తెలుసు కదా... అదే నేస్తాలూ.. ఒక పూల్‌లాంటి చోట, చాలా బంతులు
వేసిఉంచుతారే అదే! ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతి పెద్ద బాల్ పిట్ అబుదాబిలో ఉంది. 45
మీటర్ల వ్యాసార్థంలో ఇక్కడ దాదాపు 24 లక్షల బంతులు ఉన్నాయట. అందుకే ప్రపంచంలో
అతిపెద్ద బాల్ పిట్ విభాగంలో 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లోనూ స్థానం సంపాదించింది.
మీకో విషయం తెలుసా... ఈ బంతులన్నీ ఒకదాని మీద ఇంకోటి పేర్చుకుంటూ వెళ్తే...
ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా లాంటివి ఏకంగా 280 తయారు చేయొచ్చట.
ఒకవేళ వీటిని రోడ్డు మీద పరిస్తే సుమారు 400 కిలోమీటర్ల దూరం వరకు సరిపోతాయట.
ఊహించుకుంటేనే అమ్మో అనిపిస్తోంది కదూ! కానీ నిజమే... బంతులతో పాటు ఇక్కడ
ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు, మనకు ఎంతో ఇష్టమైన కార్టూన్ బొమ్మలూ ఉంటాయి.
అందులోకి వెళ్తే సమయమే తెలియదు తెలుసా!
అందుకే ఇక్కడికి వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా మనలాంటి
వాళ్లయితే ఎంతసేపైనా ఆ పూల్‌లోనే ఉండిపోతారట. అబుదాబి ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ
ప్రతినిధులు ఓ వేడుక సందర్భంగా ఈ పిట్‌ని ఏర్పాటు చేశారు. నేస్తాలూ.. ఈ విశేషాలు భలేగా
ఉన్నాయి కదా!