నేనో వింత బాతుని...!
హాయ్ నేస్తాలూ..! ఎలా ఉన్నారు..? నేనైతే చాలా బాగున్నా. ఏంటి అలా చూస్తున్నారు? హో... నాకు అర్థమైంది. 'ఇది తల మీద ఏదో తగిలించుకొని వచ్చిందేంటి?' అనుకుంటున్నారు కదా! కానీ అదేం కాదు. నా రూపమే అలా ఉంటుంది. ఈ కథనం చదివితే నా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా చదివేయండి మరి!
నా పేరు 'హుడెడ్ మెర్లాన్సర్. నేనూ ఒక రకమైన బాతునే.. నా స్వస్థలం ఉత్తర అమెరికా. ఇంకా బ్రెజిల్స్ కెనడా, క్యూబా, మెక్సికో వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. నేను కాస్త వింతగా ఉన్నాను కదూ! నా శరీరం తెలుపు, నలుపు, బ్రౌన్ రంగుల్లో ఉంటుంది. రెక్కలు కూడా నలుపు, రంగులో ఉంటాయి. మాలో ఆడ జీవుల కళ్లు బ్రౌన్, మగ వాటి కళ్లు పసుపు రంగులో ఉంటాయి. మీకో విషయం తెలుసా... నేను పుట్టినప్పుడు శరీరం మొత్తం బ్రౌన్ రంగులోనే ఉంటుంది. రోజులు గడుస్తున్నాకొద్దీ అది మారుతుంది.
అదే అందం...
నా తల మీద కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. అదే నేను అన్ని పక్షుల్లో వింతగా కనిపించేలా చేస్తుంది. నేను చిన్నచిన్న గుంపులతో ఉండటానికి ఆసక్తి చూపుతాను. నీటిలో వేటాడేటప్పుడు మాత్రం.. ఒంటరిగానే వేటాడతాను. ఇంతకీ నేనేం తింటానో మీకు చెప్పలేదు కదూ! నాకు చేపలు, పీతలంటే చాలా ఇష్టం. వాటినే ఆహారంగా తీసుకుంటాను. మా జాతికి చెందిన జీవుల్లో అత్యంత వేగంగా ఎగిరే పక్షిని నేనే తెలుసా! అన్ని పక్షుల్లా నా కాళ్లు ఉండవు. నా శరీరానికి కాస్త వెనక భాగంలో ఉంటాయి. నా బరువు 458 నుంచి 870 గ్రాముల వరకు ఉంటుంది. పొడవు 40 నుంచి 49 సెంటీ మీటర్లు. గంటకు దాదాపు 81 కిలో మీటర్ల వేగంతో ఎగురుతాను. సాధారణంగా అయితే 11 ఏళ్లు... కాస్త రక్షణ కల్పిస్తే, 18 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!