అమ్మ మాట జావా దాటలేదు!
'మనలో చాలామంది అమ్మ చెప్పింది అస్సలు వినరు. తెగ మారాం చేస్తుంటారు.కానీ ఓ అన్నయ్య మాత్రం వాళ్ల అమ్మ చెప్పిన మాటను బుద్ధిగా విన్నాడు. తాను అనుకున్నది సాధించాడు. ఓ వైపు చదువుల్లో రాణిస్తూనే... మరో వైపు కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. అప్లికేషన్లు డెవలప్ చేసి “యంగెస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్'గా 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆ అన్నయ్య ఎవరో... ఏంటో... తెలుసుకుందామా!
రాజమహేంద్రవరానికి చెందిన దామరాజు భరద్వాజ్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. "సమయాన్ని వృథా చేయడం కోసం కాకుండా, కొత్త విషయాలు తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి" అని తల్లి చెప్పిన ఆ ఒక్క మాటే మంత్రంలా పని చేసింది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కాలక్షేపం చేయకుండా తన సృజనకు పదును పెట్టి 18 ఏళ్ల వయస్సులోనే కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో శిక్షణ పొందాడు. జావా, సీ, పైథాన్‌లాంటి కంప్యూటర్ భాషలు నేర్చుకున్నాడు.
అమ్మకు బహుమతి!
చిన్నప్పటి నుంచి భరద్వాజ్‌ను అమ్మ పావని ప్రోత్సహించేది. తన కోసం ఇంతలా తపిస్తున్న ఆమెకు సాయం చేయాలనుకున్నాడు. అమ్మ ఓ పుస్తకం రాయడానికి పడుతున్న ఇబ్బందిని గమనించాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. దాని రూపమే... 'స్పీచ్‌టెక్ట్స్ అప్లికేషన్'. మనం కంపోజ్ చేయాలనుకున్నది, మాట్లాడితే చాలు దానంతట అదే తెలుగులో టైప్ చేస్తుంది. వాళ్ల అమ్మకు బుక్ రాయడానికి ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడింది.
వర్చువల్ కలం!
కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులు చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు పడిన ఇబ్బందులను భరద్వాజ్ చూశాడు. వాటిని దూరం చేయడం కోసం 'వర్చువల్ పెన్' అప్లికేషన్‌ను తయారు చేశాడు. మనం కంప్యూటర్ స్క్రీన్ ముందు ఉండి గాల్లో రాస్తే చాలు.. దాన్ని గుర్తించి ప్రోజెక్ట్ చేస్తుంది. ఇది ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడింది. ఈ ఆవిష్కరణకుగాను వారు భరద్వాజ్‌ను ఎంతో మెచ్చుకున్నారు కూడా!
"టోనీ... టోనీ... ఎస్ బాస్'!
'టోనీ' అనేది భరద్వాజ్ రూపొందించిన ఒక రకమైన వర్చువల్ అసిస్టెంట్. వాయిస్ కమాండ్ ఇస్తే కంప్యూటర్‌ను కంట్రోల్ చేస్తుంది. వందకు పైగా టాస్క్‌లు చేయగలదు. ఇది చాలా మందికి చిన్న చిన్న పనులకు సమయం వృథా కాకుండా ఉపయోగపడుతుంది. ఇలా చిన్న వయసులోనే పలు అప్లికేషన్లు రూపొందిస్తున్న భరద్వాజ్‌లో ఉన్న ప్రతిభను 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' వారు గుర్తించారు. 'యంగెస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్'గా ధ్రువపత్రాన్ని అందించారు.
అదే ఆశయం...
“దేశ అభివృద్ధిలో నువ్వు భాగం కావాలని అమ్మ చెప్పింది. భవిష్యత్తులో ఉన్నత విద్య అభ్యసిస్తాను. టెక్నాలజీ పరంగా కొత్త ఆవిష్కరణలు చేసి దేశానికి ఉపయోగపడాలనేదే నా ఆశయం' అంటున్నాడు భరద్వాజ్. మరి ఇది నెరవేరాలని మనమూ మనసారా కోరుకుంటూ... ఆల్ ది బెస్ట్' చెప్పేద్దామా!