భలే... భలే ఐస్‌క్రీం పార్లర్‌...!



హాయ్‌ నేస్తాలూ...! ఎంత చలికాలం అయినా... అమ్మ తినొద్దని చెప్పినా... మారాం చేసి మరీ అప్పుడప్పుడు ఐస్‌క్రీం కొనిపించుకొని తినేస్తున్నాం.. నిజమే కదా పిల్లలూ..! 'ఏదో తినేస్తున్నాంలే... కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు?” అనుకుంటున్నారా.. దానికి సంబంధించిన విషయమే ఇప్పుడు మన 'హాయ్‌బుజ్జీ' మీ కోసం తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో వెంటనే తెలుసుకుందామా... అయితే ఈ కథనం చదివేయండి మరి!

ఐస్‌క్రీం అంటే చాలు... పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు. తినాలనిపించినప్పుడల్లా ఐస్‌క్రీం పార్లర్‌కు వెళ్లి, నచ్చిన ప్లేవర్లు తీసుకుంటాం. కానీ, అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం పార్లర్‌ ఎక్కడుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అది క్యూబాలోని హవాయి నగరంలో ఉంది. దీని పేరు 'కొప్పేలియా' ఇంకా 'కాథెడ్రల్‌ అని కూడా పిలుస్తారు. మీకో విషయం తెలుసా.. ఇందులో ఒకేసారి దాదాపు 1000 మంది కూర్చొని ఐస్‌క్రీం తినొచ్చట. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజమే.

ధర తక్కువే...

అంత పెద్ద ఐస్‌క్రీం పార్లర్‌ అంటే కచ్చితంగా అక్కడ దొరికే ఐస్‌క్రీం ధర వందల్లోనే ఉంటుంది అనుకుంటున్నారు. కదూ..! అలా అనుకుంటే పొరపడినట్లే నేస్తాలూ... ఎందుకంటే అక్కడ ఒక ఐస్‌క్రీం ధర రూ.11 నుంచి రూ.18 మాత్రమే. ఇంత తక్కువ ధర ఉంటే. మేమైతే ప్రతిరోజు ఒక ఐస్‌క్రీం కొనుక్కునే వాళ్లం అనుకుంటున్నారు కదా! డబ్బులు తక్కువ కాబట్టి రుచిలో ఏమైనా తేడా ఉంటుందేమో అనుకోకండి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడికి వెళ్లినవాళ్లు చెబుతున్నారు.

రోజూ వేలల్లో వస్తుంటారు

ఈ చోటుకి ఒక రోజుకు దాదాపు 80 వేల మంది వస్తారట. అంతమందికి వెంటవెంటనే ఐస్‌క్రీం అందించడానికి ఈ పార్లర్‌లో ఏకంగా 600 మంది పనివాళ్లు ఉన్నారట. ఈ విశేషాలన్నీ మీకు భలే నచ్చాయి కదూ... అన్నట్టు ప్రెండ్స్‌ ఎక్కువగా ఐస్‌క్రీమ్స్‌ తినకండి, జలుబు చేస్తుంది... సరేనా...!

Responsive Footer with Logo and Social Media