క్రీక్. కీక్.. నేను సూట్‌కేస్‌ను కాదోచ్...!
హాయ్ ఫ్రెండ్స్... నన్ను చూసి చక్రాలున్న సూట్‌కేస్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నేనో బుజ్జి ఎలక్ట్రిక్ బైక్‌ను. అలా అని ఆటబొమ్మ అనుకునేరు.. కానే కాదు! మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా!
నా పేరు మోటోకాంపాళ్టో. నన్ను హోండా కంపెనీ వాళ్లు తయారు చేశారు. నేను 86.7 సెంటీమీటర్ల పొడవు, 48.6 సెంటీమీటర్ల వెడల్పు, 88.9 సెంటీమీటర్ల ఎత్తు ఉంటాను. 490 వాట్ శక్తి గల మోటారు, 8.8 ఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ నా సొంతం. నన్ను ఒక్కసారి ఛార్జి చేస్తే 19 కి.మీ.ల వరకు నడుస్తాను. నా గరిష్ట వేగం గంటకు 24 కి.మీ. నేను పూర్తిగా ఛార్జి కావాలంటే మూడు గంటల యాభై నిమిషాల సమయం పడుతుంది. 19 కిలోల బరువుతో చాలా తేలికగా ఉంటాను. అంటే నన్ను సునాయాసంగా ఎక్కడి కంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు అన్నమాట. బస్సు, రైలు, కారులోనూ ఎంచక్కా నన్ను రవాణా చేయొచ్చు. నా మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలుంటుంది. చూడ్డానికి చిన్నగా ఉన్నాను కదా అని... నా ఖరీదు తక్కువ అనుకునేరు. నేను దాదాపు రూ.82,000 ధర పలుకుతాను. నేస్తాలూ ప్రస్తుతానికి ఇవీ నా విశేషాలు ఇక ఉంటామరి.