వింత పండు... పోషకాలు మెండు!
హాయ్ ఫ్రెండ్స్....! పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి కదూ! కానీ మనలో చాలామంది వాటిని తినమని మారాం చేస్తుంటారు కదా! మీరు ఇష్టంగా తినే జంక్‌పుడ్ కన్నా. పండ్లు ఎన్నో రెట్లు మేలు తెలుసా! ఇప్పుడిదంతా ఎందుకంటే. మనం ఈ రోజు ఓ కొత్త పండు గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి! ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.
పుచ్చకాయ, కీరదోస కుటుంబానికి సంబంధించిన మొక్కకు చెందిన ఈ పండు పేరు గాక్. ఇది చూడ్డానికి ఎర్రగా భలే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది తీగజాతికి చెందిన పండ్ల మొక్క. ఇందులో ఆడ, మగ రెండు మొక్కలుంటాయి. ఈ గాక్ పండ్లు ఎక్కువగా వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్, చైనా, ఆస్ట్రేలియాలో లభిస్తుంటాయి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటి ఖరీదు కూడా అధికంగానే ఉంటుంది. ఈ పండ్లలోని గుజ్జు ఎరుపు రంగులో కనువిందు చేస్తుంది. రుచి సైతం భలేగా ఉంటుంది.
జౌషధ గుణాలు అధికం...
ఈ పండ్లలో అరుదైన పోషకాలుంటాయి. కేవలం పండ్లే కాకుండా ఈ మొక్క పత్రాలు, విత్తనాలను కూడా పలు రకాలుగా ఉపయోగిస్తుంటారు. గుండె, కళ్లు, చర్మం ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివని వైద్యులు చెబుతుంటారు. సంప్రదాయ వైద్యంలోనూ ఈ మొక్కను ఉపయోగిస్తుంటారు. కొన్ని శతాబ్దాలుగా చైనా, వియత్నాంలో వీటిని వైద్యంలో వాడుతున్నారు. ఈ ఫలాలకు ప్రపంచవ్యాప్తంగా చాలా పేర్లున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా వీటిని పిలుస్తుంటారు.
కూరగానూ...
గాక్ మొక్కలు సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్యలో పుష్పిస్తాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కాయలు కాస్తాయి, ఆస్ట్రేలియాలో మాత్రం డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో పువ్వులు పూస్తాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాయలు కాస్తాయి. వియత్నాంలో పెళ్లి, నూతన సంవత్సర వేడుకల్లో ఎర్రని ఈ గాక్ పండును ఉపయోగిస్తుంటారు. శ్రీలంకలో ఈ కాయలతో కూర సైతం చేస్తారు. థాయ్‌లాండ్‌లో ఐస్‌క్రీంతో పాటుగా ఈ పండ్లను తింటారు. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ వింత పండు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!