జోయి కోచింగ్ సెంటర్..పక్షులకు మాత్రమే ప్రవేశం…
హాయ్ నేస్తాలూ...! ఇప్పటి వరకు మనకు... ఆటలు, పాటలు, చదువు... ఇంకా ఎన్నో రంగాల్లో శిక్షణ గురించి తెలుసు. కానీ అది మన మానవులకు మాత్రమే కదా! 'మరి ఈ రంగాల్లో శిక్షణంటే. మనుషులకే కదా ఇచ్చేది' అనుకుంటున్నారు. కదూ! కానీ ఇక్కడ కోడికి శిక్షణ ఇచ్చారు. ఆశ్చర్యంగా ఉంది కదా! ఆలస్యం చేయకుండా వెంటనే కథనం చదివేయండి. ఆ వివరాలేంటో మీకే తెలిసిపోతాయి!
ఇటలీకి చెందిన జోయి ఓ కోడికి సంగీతం వాయించడంలో శిక్షణ ఇస్తోంది. ఆశ్చర్యపడకండి.. ఇది నిజమే! తనకు జంతువులు, పక్షులంటే చాలా ఇష్టమట. ఆమెకు అయిదేళ్ల వయసు ఉన్నప్పుడే... వాళ్ల ఇంట్లో ఉండే చిన్ని పావురానికి శిక్షణ ఇచ్చేదట. కొన్ని సంవత్సరాల తర్వాత.. కోళ్లు ఏవైనా తొందరగా నేర్చుకోగలవని అనుకొని, క్రియోల్ అనే కోడిని ఎంచుకొని దానికి శిక్షణ ఇస్తోంది మన జోయి. దానితో పాటుగా మరిన్ని కోళ్లు, ఫాల్కన్లు, పావురాలు, టర్కీ కోళ్లకు శిక్షణ ఇస్తోంది.
'చాలా కష్టమట!
పక్షులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం అంత సులభమేం కాదట నేస్తాలూ! ఫాల్కన్లు కాస్త ప్రమాదకమైనవట. కెనరీ పక్షులేమో.. ఎక్కువగా ఎగురుతాయట. ఒక్కసారి అవి పారిపోతే మళ్లీ తీసుకురావడం చాలా కష్టమట. 'అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ అన్నీ నేర్పించాల్సి ఉంటుంది. చాలా ఓపికగా వాటిని మచ్చిక చేసుకోవాలి. లేకపోతే స్థిరంగా ఒకచోట ఉండలేవు. చెప్పినట్లు నేర్చుకోలేవు. దీనికి... ప్రశాంతంగా పని చేసుకోవడం ఒక్కటే మార్గం. అప్పుడే మన చుట్టుపక్కల ఉండే జీవులు కూడా చెప్పినట్లు వింటాయి' అని జోయి చెబుతోంది.
ఎంతో ఓపికతో...
ఇప్పుడు తన దగ్గర ఉన్న పక్షులకు... సంగీత పరికరాలు వాయించడం, పల్టీలు కొట్టడం, బంతులతో ఆటడం వంటివి నేర్చుతుందట. ఓపికతో ఇవన్నీ నేర్పిస్తున్న జోయిని... "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా గుర్తించారు. తనతో పాటు ఆమె శిక్షణ ఇచ్చే క్రియోల్ అనే కోడికి కూడా అందులో స్థానం కల్పించారు. ఈ విశేషాలు భలే ఉన్నాయి కదా నేస్తాలూ!