భలే... భలే... పంచవన్నెల చేప!
హాయ్ నేస్తాలూ బాగున్నారా! మీకు చిలుకలంటే ఇష్టం కదా! అలాగే చేపలన్నా నచ్చుతాయి కదూ! మరి మీకు చిలుక చేప గురించి తెలుసా? తెలియదు కదూ! అయితే ఇంకెందుకాలస్యం. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది. సరేనా!
రంగురంగుల ఈ చేప పేరు ప్యారెట్ ఫిష్. వీటి పొలుసులు అచ్చం చిలుక రంగుల్లో ఉండటం వల్లే వీటికి ఈ పేరు వచ్చింది. వీటిలో దాదాపు 95 రకాలున్నాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బల్లో రాళ్లతో కూడిన తీరాల్లో కనిపిస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా జీవిస్తుంటాయి. 80 నుంచి 50 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటిలో కొన్ని రకాలు దాదాపు మీటరు వరకు కూడా పొడవు పెరుగుతాయి. బ్లూలిప్ ప్యారెట్‌ఫిష్ అనే రకం మాత్రం కేవలం 18 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది.
ఏం తింటాయంటే...
ఈ చేపలు ఎక్కువగా ఆల్లేను ఆహారంగా తీసుకుంటాయి. వీటి జీవిత కాలం దాదాపు ఏడు సంవత్సరాలు. మిగతా చేపలకంటే భిన్నంగా వీటికి చాలా బలమైన దంతాలుంటాయి. వీటితోనే ఇవి రాళ్లను ఇసుకగా కూడా మారుస్తాయి. వీటి దంతాలే కాదు.. పొలుసులు సైతం బాగా బలంగా ఉంటాయి. ఈ చేపలు పగడపు దిబ్బల రక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తాయి. వాటి మీద పేరుకున్న అదనపు ఆల్లేను తింటూ, పగడపు దిబ్బలు చక్కగా పెరిగేలా చేస్తాయి. నిజానికి ఈ ప్యారెట్‌ఫిష్ లేకుంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థే దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
బుడగలో నిద్ర...
ఈ ప్యారెట్ ఫిష్‌లలో కొన్ని రకాలు ప్రతి రోజూ రాత్రి వేళలో నిద్రించే ముందు ఒక గంట సమయాన్ని మ్యూకస్ బుడగను తయారు చేసుకోవడం కోసం వెచ్చిస్తాయి. ఈ బుడగలు పారదర్శకంగా ఉంటాయి. పరీక్షగా చూస్తే కానీ.. కనిపించవు అన్నమాట. ఇలా తయారు చేసుకున్న వీటిలోనే ఈ చేపలు ఎంచక్కా నిద్రిస్తాయి. అంటే ఓ రకంగా ఇవి వాటి స్లీపింగ్ బ్యాగులన్నమాట. రక్తం పీల్చే పరాన్నజీవులు, శత్రువులైన ఈల్ఫ్, సొరచేపల నుంచి రక్షణ కోసం ఇవి ఈ బుడగల్ని ఉపయోగించుకుంటాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ ప్యారెట్ ఫిష్ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!