నేను గొర్రెను కాదు... కుక్కనూ కాదు!!
ముద్దుగా, బొద్దుగా... ఉన్న నన్ను చూసి మీరు... 'గొర్రె భలే ఉంది!" అని కానీ... 'బుజ్జి కుక్క చక్కగా ఉంది!” అని కానీ అనుకుంటే... తప్పులో కాలేసినట్లే ఎందుకంటే నేను గొర్రెను కాదు, కుక్కను అసలే కాదు! మరి ఎవరినో తెలుసా...? బుల్లి కుందేలును! విచిత్రంగా ఉంది కదూ! ఆ విశేషాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరి మీరూ తెలుసుకుంటారా!
నా పేరు అంగోరా. నేను చాలా ప్రాచీన జీవిని. మాలో విభిన్న జాతులున్నాయి. నేను పెంపుడు కుందేలును. ఎంచక్కా నన్ను పెంచేసుకోవచ్చన్నమాట. నేను నిజానికి టర్కీకి చెందిన జీవిని. 1723 ప్రాంతంలో ఫ్రాన్స్‌లో అడుగుపెట్టాను. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ రాజకుటుంబాల వారు నన్ను ఎక్కువగా పెంచుకునేవారు. తర్వాత క్రమంగా యూరప్ ఖండం మొత్తం విస్తరించాను.
చిన్ని చిన్ని.. ఉన్ని!
గొర్రెల మాదిరే నా శరీరంపైనా ఉన్ని పెరుగుతుంది. ఇదే నన్ను మిగతా కుందేళ్లకు భిన్నంగా నిలుపుతోంది. నా ఉన్ని చాలా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. పట్టుకుంటే పట్టును తలపిస్తుంది. అందుకే నన్ను ఉన్ని కోసమే ఎక్కువగా పెంచుతుంటారు తెలుసా! నా ఉన్ని ప్రతినెలా మూడు సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇంత వేగంగా పెరుగుతుంది కాబట్టే ఎప్పటికప్పుడు నా చర్మంపైనున్న వెంట్రుకలను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను. ఒక్కోసారి పొరపాటున నా జుట్టును నేనే తినేస్తాను. తినడమైతే తింటాను.. కానీ దాన్ని జీర్ణం చేసుకునే శక్తి నా పొట్టకు లేదు. దీంతో జబ్బున పడతాను. విపరీతంగా ఉన్ని పెరిగిపోతే చర్మవ్యాధులూ చుట్టుముడతాయి. అందుకే ఉన్ని వల్ల ఎంత అందం వచ్చినా... దాన్ని తొలగిస్తూనే ఉండాలి. లేకపోతే నాకు చాలా కష్టం. చాలా నష్టం! బుజ్జి బుజ్జి బుజ్జాయినే!
నేను చూడ్డానికి ఉన్ని బంతిలా పెద్దగా కనిపించినా... నా బరువు తక్కువే ఉంటుంది తెలుసా! మాలో చాలా రకాలున్నప్పటికీ ఇంగ్లిష్ అంగోరా, ఫ్రెంచ్ అంగోరా, జర్మన్ అంగోరా, జెయింట్ అంగోరా, శాటిన్ అంగోరా అనే రకాలు ప్రముఖమైనవి. ఇంకా చైనీస్ అంగోరా, ఫైనీష్ అంగోరా, జపనీస్ అంగోరా, రష్యన్ అంగోరా, సెయింట్ లూసియన్ అంగోరా, స్విస్ అంగోరా, డచ్ అంగోరా అనే రకాలూ ఉన్నాయి. వీటిలో ఇంగ్లిష్ అంగోరా రకాలు అత్యల్పంగా 2 నుంచి 3.50 కిలోగ్రాముల బరువు తూగుతాయి. జెయింట్ అంగోరాలేమో అత్యధికంగా 5.4 కిలోల వరకు బరువుంటాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! ఇక ఉంటామరి బై .. బై ...!
అన్నట్లు మీకో విషయం తెలుసా! మోర్లాన్ హిల్, కాలిఫోర్నియాకు చెందిన డా.బెట్టీ చూ అనే ఆవిడ ఓ ఇంగ్లిష్ అంగోరా కుందేలును పెంచుకుంటోంది. దీనిపేరు ఫ్రాన్సెస్కా. దీని ఉన్ని ఏకంగా 36.5 సెంటీమీటర్ల పొడవుతో చూడ్డానికి పీచుమిఠాయిలానే ఉంటుంది. దీంతో ప్రాన్సెస్కా ప్రపంచంలో అంత్యంత పొడవైన ఉన్ని ఉన్న కుందేలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్చ్... అయ్యో పాపం ప్రాన్సెస్కా!' అని మనం అనుకోవాల్సిన పని లేదు నేస్తాలూ! ఎందుకంటే యజమానురాలు దీని బాగోగుల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటారట.