నేను కూడా కాకినే...!



హాయ్‌ నేస్తాలూ! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా! మీకు నా పాటలూ, మాటలూ వినాలని ఉందా? నన్ను చూడాలని కూడా అనిపిస్తుంది కదూ! “అసలు నువ్వు ఎవరో తెలియకుండా. అదంతా ఎందుకు అనిపిస్తుంది అంటారా?” సర్లే ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను. మరి ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి...!

నా పేరు పైడ్‌ క్రౌ. అంటే నేను కూడా కాకినే అన్నమాట. 'సాధారణంగా కాకులంటే నలుపు రంగులోనే ఉంటాయి కదా! ఇది ఇలా ఉందేంటి? ' అనుకుంటున్నారా. నా రంగు సహజంగానే అలా ఉంటుంది ఫ్రెండ్స్‌, ముక్కు, కాళ్లు, రెక్కలు, తోక నలుపు రంగులో ఉంటాయి. మెడ కింద, పైన భాగం మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. అన్నట్టు... నేను ఆఫ్రికాకు చెందిన పక్షిని. కెన్యా, థాయ్‌లాండ్‌, గునియా వంటి దేశాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాను.

అన్నింట్లోనూ ఎక్కువే...

నేను ప్రత్యేకంగా ఒకేదాన్ని ఆహారంగా ఏం తీసుకోను. ఏది దొరికితే దాంతో బొజ్జ నింపుకుంటా. చిన్నచిన్న కీటకాలు, పక్షుల గుడ్లు, విత్తనాలు, పండ్లు, దుంపలు ఇలా అన్నింటినీ తినేస్తాను. కాబట్టి నాకు ఆహారానికి అసలు లోటేమీ ఉండదు. మేము చిన్న గుంపులుగా ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే. మేము మీ దగ్గర ఉండే కాకుల కంటే పరిమాణంలో పెద్దగానే ఉంటాము. 'మా ముక్కు, కాళ్లు కూడా పెద్దగానే ఉంటాయి.

పాటలు పాడతా...!

మీకో విషయం తెలుసా...! కాస్త శిక్షణ ఇస్తే నేను మాట్లాడగలను. పాటలు కూడా పాడగలను. కాకి, పాట పాడటమేంటి అనుకుంటున్నారా? కానీ నేను పాడతాను నేస్తాలూ...! నేను బాధగా ఉన్నప్పుడు ఒకలా, సంతోషంగా ఉన్నప్పుడు మరోలా శబ్దాలు చేస్తాను. అప్పుడు నేను ఎలా ఉన్నానన్న విషయం నా తోటి పక్షులకు తెలిసిపోతుందన్నమాట. నా బరువు 520 గ్రాముల వరకు ఉంటుంది. పొడవు 46 నుంచి 52 సెంటీ మీటర్ల వరకు ఉంటాను. సాధారణంగా అయితే 6 సంవత్సరాలు రక్షణ కల్పిస్తే... 20 ఏళ్ల వరకు జీవిస్తాను. ఇవి నా విశేషాలు మీకు నచ్చే ఉంటాయి కదూ.. ఉంటా నేస్తాలూ బై మరి!

Responsive Footer with Logo and Social Media