ముస్కీ మూపికాన్ని నేను!
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా! నేనో ఎలుకను. కేవలం మూషికాన్నే అని నన్ను తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే అత్యంత అరుదైన జీవిని కూడా! పైగా నాలో కేవలం ఎలుక లక్షణాలే కాకుండా... కొన్ని కంగారూ గుణాలు కూడా ఉన్నాయి! అందుకే నన్ను ముస్కీ ర్యాట్ కంగారూ అని పిలుస్తారు. మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా!
మేం ప్రపంచంలో ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాం. అది కూడా ఈశాన్య ప్రాంతంలోనే... దాదాపు 500 నుంచి 100 గ్రాముల వరకు బరువు తూగుతాం. 155 నుంచి210 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాం. 15 నుంచి 180 మి.మీ వరకు మా తోక ఉంటుంది. మాలో మగవాటికన్నా ఆడవి కాస్త పెద్దగా ఉంటాయి. మా తోకలకు వెంట్రుకలు ఉండవు. పొలుసులు మాత్రమే ఉంటాయి. మా చెవులకు కూడా అస్సలు వెంట్రుకలు ఉండవు తెలుసా! రంగు విషయానికొస్తే... మేం ముదురు గోధుమ వర్ణంలో ఉంటాం.
ఒంటరి జీవిని నేను...!
మేం సాధారణంగా ఒంటరిగా బతికేందుకే ఇష్టపడతాం. అలా అని మిగతావాటితో కలివిడిగా ఉండము అని కాదు. ఆహార సేకరణ సమయంలో ఒక్కోసారి గుంపులుగా కూడా సంచరిస్తుంటాం. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే చురుకుగా ఉంటాం. తర్వాత చక్కగా విశ్రాంతి తీసుకుంటాం. పండ్లు, విత్తనాలు, వేర్లు, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాం. ఆడ కంగారూలకు ఉన్నట్లే మాలో ఆడవాటికి కూడా పొట్టకు సంచి ఉంటుంది. మేం పూర్తిగా ఎదగని పిల్లలకు జన్మనిచ్చి, వీటిలోనే వాటిని పెంచుతాం. మరో విషయం ఏంటంటే... కంగారూ పిల్లల కంటే. మా పిల్లలే కాస్త వేగంగా పెరుగుతాయి.
పర్యావరణానికి మేలు...
మేం పర్యావరణం, ప్రకృతికి ఎంతో మేలు చేస్తాం తెలుసా. ఎలా అంటే. మేం పండ్లను ఒక చోట తినం. అలా తింటూ... తింటూ... వెళుతుంటాం. అప్పుడు ఆ పండ్లలోని విత్తనాలు ఇతర ప్రదేశాలకు చేరతాయి. అనుకూల వాతావరణం ఏర్పడ్డప్పుడు అక్కడ అవి మొలకెత్తుతాయి. ఇలా మేం అడవుల్లో పచ్చదనం పెంపొందించడంలో సాయపడుతుంటాం. నేస్తాలూ... మీరు కూడా పెద్దల సహకారంతో మొక్కల్ని నాటి, వాటిని సంరక్షించండి సరేనా! మొత్తానికి ఇదీ మా విశేషాలు... ఇక ఉంటామరి బై.. బై...!