నేను కంగారూనే... కానీ నాది ఆస్ట్రేలియా కాదు!
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా! పై శీర్షిక చదివి... 'ఇదేంటి తాను కంగారూనే అంటోంది. కానీ తనది ఆస్ట్రేలియా కాదంటోంది' అని కాస్త తికమకపడుతున్నారు కదూ! “తూచ్... అది అబద్ధం చెబుతుండొచ్చు' అని మీలో కొందరు చిచ్చరపిడుగులు సందేహిస్తున్నారు కదా! కానీ కాదు... నేను కానీ నాది ఆస్ట్రేలియా కాదు. ఎలా అంటే. ఆశ్వ దోస, అప్పడం, వడ...! అన్నీ ఇక్కడే చెప్పేస్తానా ఏంటి? ఈ కథనం చదివేయండి... మీకే తెలుస్తుంది... సరేనా!
నా పేరు గోల్డెన్ మాంటెల్డ్ ట్రీ కంగారూ. న్యూగినియా ద్వీపం నా స్వస్థలం. నేను పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాను. అత్యంత అరుదైన ప్రాణిని. ప్రస్తుతం తీవ్రంగా అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాను. మా సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 మాత్రమే అని శాస్త్రవేత్తల అంచనా!
ఏం తింటానంటే...
'నేను ఇతర ట్రీ కంగారూల్లానే చెట్లపై నివసిస్తాను. పత్రాలు, చిన్న చిన్న కొమ్మలు, వేర్లు, బెరడు, పండ్లను ఆహారంగా తీసుకుంటాను. నా జనాభా ప్రస్తుతం వాయవ్య పాపువా న్యూగినియాలోని టోరిసెల్లి పర్వతాలు, ఇండోనేషియాలోని ఫోజా పర్వతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ ప్రాంతాలు సముద్ర మట్టానికి 680 నుంచి 1,100 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి.
స్వర్ణ వర్ణంలో...
'నేను బంగారు రంగులో మెరిసిపోతుంటాను. చేతులు, మెడ, కడుపు భాగం లేత రంగులో ఉంటే వీపు భాగం ముదురు వర్ణంలో ఉంటుంది... ఒత్తైన ఉన్నితో చిన్నపాటి ఎలుగుబంటిలా కనిపిస్తాను. పొడవైన తోక నా సొంతం. కంగారూలకు ఉన్నట్లే నా కడుపునకు కూడా సంచి ఉంటుంది. ఇందులోనే నా పిల్లలను నేను సంరక్షిస్తాను. నా జీవితకాలం 5 నుంచి 15 సంవత్సరాలు. దాదాపు 1 కిలోల వరకు బరువు పెరుగుతాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. సరే... ఇక ఉంటామరి బై.. బై...!