చూడచక్కని నక్కను నేను!
హాయ్ నేస్తాలూ... బాగున్నారా! నన్ను చూసి మీరు బుజ్జి కుక్క అనుకుంటున్నారు కదూ! కానీ కాదు... నేనో నక్కను. చూడచక్కగా ఉన్న నా గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే చెప్పి పోదామని ఇదిగో నేనే ఇలా స్వయంగా వచ్చాను. మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం... ఈ కథనం చదివేయండి.
నా పేరు ఆర్కిటిక్ నక్క. తెల్ల నక్క ధ్రువపు నక్క మంచు నక్క అనే పేర్లు కూడా ఉన్నాయి. నేను అతి శీతల వాతావరణంలో పెరుగుతాను కదా! దానికి తగ్గట్లుగానే నాకు ఒత్తైన, మెత్తని బొచ్చు ఉంటుంది. ఇదే నన్ను చలి బారి నుంచి కాపాడుతుంది. కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక, మాలో చాలా వరకు పుట్టిన మొదటి సంవత్సరంలోనే చనిపోతుంటాయి. అన్ని గండాలూ గట్టెక్కితే మాత్రం... మేం దాదాపు 11 సంవత్సరాల వరకు జీవిస్తాం.
'చిరు జీవిని!
నేను చిరు జీవిని. 46 నుంచి 68 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. 8.5 కేజీల వరకు బరువు తూగుతాను. నేను ఎలుకలు, సీల్స్, చేపలు, బాతులు, సముద్ర పక్షులను ఆహారంగా తీసుకుంటాను. సముద్ర నాచు, ఇతర చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాను. గోల్డెన్ ఈగల్స్, ఆర్కిటిక్ తోడేళ్ల, ధ్రువపు ఎలుగుబంట్లు నాకు ప్రధాన శత్రువులు.
శీతాకాలంలో...
ధ్రువపు ఎలుగుబంట్లలా మేం శీతాకాలంలో దీర్గనిద్రలోకి వెళ్లం. మెలకువగానే ఉంటాం. కానీ వేసవిలో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. మా శరీర బరువును, కొవ్వు నిల్వలనూ పెంచుకుంటాం. ఇవే మమ్మల్ని చలి బారి నుంచి కాపాడతాయి. చలికాలంలో... ఏదో దొరికిన కొద్దిపాటి ఆహారంతో నెట్టుకొస్తాం
తల దాచుకుంటూ...
'మేం ఏర్పాటు చేసుకునే స్థావరాలే మాకు శ్రీరామరక్ష ఇవే మమ్మల్ని మా శత్రువుల బారి నుంచి కాపాడతాయి. మా నివాసాలకు అనేక దారులు ఉండేలా చూసుకుంటాం. ఓ దారి గుండా శత్రువు మా మీద దాడి చేస్తే... మరో మార్గంలో తప్పించుకునేందుకే మేం ఇలా చేస్తుంటాం. మరో విషయం ఏంటంటే. శీతాకాలంలో మా బొచ్చు తెల్లగా, దట్టంగా ఉంటుంది. వేసవికాలంలో 'మాత్రం కాస్త పలుచబడి, బూడిదరంగులోకి మారుతుంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి... బై ... బై ...!