నీటిలో నేనే మేటి!
హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా! నేనో సముద్ర చేపను. నాకో ప్రత్యేకత ఉంది తెలుసా! ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన చేపను నేనే!
ఆ విశేషాలు మీతో చెప్పిపోదామనే... ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను. తెలుసుకుంటారా మరి! నా పేరు సెయిల్ ఫిష్ నాలో అట్లాంటిక్ సెయిల్ ఫిష్, ఇండో పసిఫిక్ సెయిల్ ఫిష్ అనే రెండు రకాలున్నాయి. నేను గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదగలను. మిగతా చేపలతో పోల్చుకుంటే నేను చాలా వేగంగా పెరుగుతాను. ఒక్క సంవత్సరంలోనే 4 నుంచి 5 అడుగుల వరకు పొడవు పెరుగుతాను. అలా అని నేను నా జీవితకాలమంతా పెరుగుతూనే ఉండను. 10 అడుగులకు మించి పెరగను. గరిష్టంగా 90 కిలోల వరకు బరువు తూగుతాను. మామూలుగా అయితే నేను మీ మనుషుల జోలికి రాను. కానీ నాకు ఆపద తలపెట్టాలని చూస్తే మాత్రం దాడి చేస్తాను.
ఏం తింటానంటే...
నేను చిన్న చిన్న చేపలు, ఇతర జలచరాలను తిని నా బొజ్జ నింపుకొంటాను. సముద్ర పాచిని కూడా ఆహారంగా తీసుకుంటాను. మేం చిన్నగా ఉన్నప్పుడు ఇతర చేపలకు ఆహారమవుతాం. కానీ మేం పెరిగాక మాత్రం ఇతర జలచరాలకు అంత తేలిగ్గా దొరకం. షార్క్‌లు, కిల్లర్‌వేల్‌లు మాత్రం మమ్మల్ని వేటాడతాయి. నా జీవితకాలం 18 నుంచి 15 సంవత్సరాలు. కానీ మాలో చాలా వరకు 4 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి.
రంగులు మారుస్తా...
నేస్తాలూ.. నాకు మరో ప్రత్యేకత కూడా ఉంది తెలుసా! అదేంటంటే... నేను రంగులు 'మార్చగలను! నా నరాల వ్యవస్థ వల్లే ఇదంతా సాధ్యం. ముఖ్యంగా వేటాడేటప్పుడు నా ఎరను కాసేపు అయోమయానికి గురి చేయడం కోసం నా శరీరం మీద లేత నీలం, పసుపు చారలు వచ్చేలా చేస్తాను. నేను చాలా వేగంగా ఈదుతాను కదా! కానీ చిరుత నా కన్నా వేగంగా పరిగెత్తగలదు. అంటే మొత్తం మీద వేగవంతమైన జీవి చిరుతే. నీళ్లలో మాత్రం నేనే ఛాంపియన్. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! సరే ఇక ఉంటా మరి.. బై.. బై...!