ఈ చిన్నారి... అదరగొడుతోంది…



హలో ఫ్రెండ్స్‌..! మనకు కాస్త సమయం దొరికితే చాలు... సరదాగా స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటాం... కానీ, మన స్కూల్లో టీచర్లు వేదిక మీద మాట్లాడమని చెప్పినా, ఎవరైనా కొత్త వాళ్లతో మాట్లాడమని అమ్మానాన్నలు చెప్పినా... అస్సలు మాట్లాడం. అమ్మో నాకు భయం అని ఏదోలా తప్పించుకుంటాం. కానీ ఓ చిన్నారి మాత్రం అయిదేళ్లకే వ్యాఖ్యాతగా మారింది. ప్రపంచ గుర్తింపు పొందింది. మరి తనెవరో... ఆ వివరాలేంటో తెలుసుకుందామా...

దుబాయ్‌కి చెందిన కియారా కౌర్‌కు ఏడు సంవత్సరాలు. ప్రస్తుతం తను రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి ఎంతమంది ముందైనా చాలా ధైర్యంగా మాట్లాడగలదు. తనకు అయిదేళ్ల వయసు ఉన్నప్పుడే... ఎంతోమంది ప్రముఖులు మాట్లాడిన టెడెక్స్‌ వేదిక మీద ప్రసంగించి, ప్రపంచంలోనే 'యంగెస్ట్‌ టెడెక్స్‌ స్పీకర్‌గా నిలిచింది.

చదవడం ఇష్టం...!

'మన కియారాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. ఇప్పటి వరకు దాదాపు 2వేల పుస్తకాలు చదివానని తానే స్వయంగా చెప్పింది. మన తరగతి పుస్తకాలు చదవడానికే సమయం సరిపోవట్లేదు. తను ఇన్ని పుస్తకాలు ఎలా చదివిందబ్బా.. అని ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ నిజమే నేస్తాలూ..! ఆమె బ్యాగ్‌లో ఎప్పుడూ పుస్తకాలు ఉంటాయట. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చదువుతూనే ఉంటుందట. ఇంకో విషయం ఏంటంటే . పిల్లలకు సంబంధించిన 88 పుస్తకాలు ఆగకుండా 1.45 గంటల్లో చదివేసింది. తను దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ ఎక్స్‌పోకు కీనోట్‌ స్పీకర్‌గా కూడా వ్యవహరించింది. తన ప్రతిభతో 'వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లలో స్థానం దక్కించుకుంది.

రాసింది కూడా...

తను పుస్తకాలు చదవడమే కాదు.. రాస్తుంది కూడా! తన మొదటి పుస్తకానికి 'డైరీ ఆఫ్‌ ఎర్‌ ఇయర్స్‌ ఓల్డ్‌ చాటర్‌బాక్స్‌ సెట్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అని పేరు పెట్టింది. ఆ పుస్తకాన్ని ఏడు నెలల్లో పూర్తి చేసిందట. అందులో తన అయిదేళ్ల ప్రయాణాన్ని అందరికీ అర్దమయ్యేటట్లు చాలా చక్కగా వివరించిందట. మరో విషయం ఏంటంటే. వాళ్ల కుటుంబ సభ్యులు మన భారతదేశానికి సంబంధించిన వారేనట. కియారా దుబాయ్‌లో యువత కోసం ఏర్పాటు చేసిన సీఓపీ28, సీఓవై18 వేదికల మీద కూడా తన ప్రసంగాన్ని వినిపించింది. ఇంత దైర్యంగా మాట్లాడటానికి కారణం తను చదివిన పుస్తకాలేనని చెబుతోంది మన కియారా... మరి మనమూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందామా...

Responsive Footer with Logo and Social Media