నేనో బాహుబలి చేపను!
హాయ్ ఫ్రెండ్స్... బాగున్నారా?! ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. నేను ఎవరనా?! నేనో బాహుబలి చేపను. నాకు తెలిసి నన్ను మీరు ఇంతకుముందెన్నడూ చూసి ఉండరు. అందుకే నా విశేషాలు మీతో పంచుకుందామని... ఇదిగో ఇలా వచ్చాను.
నా పేరు ఓషన్ సన్‌ఫిష్. నన్ను మోలా అని కూడా పిలుస్తుంటారు. ఈ రెండు పేర్లే కాకుండా నాకు... మాన్విస్, పీక్స్ లువా, పాయిజన్ లూన్, పెజ్ లూనా, పీక్స్‌లూనా, పెస్సే లూనా, హోల్డల్, మెనెఫిస్క్, మోండ్‌ఫిష్... ఇలా చాలానే ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద చేపజాతుల్లో నేనూ ఒకదాన్ని. సాధారణంగా 200 కిలోల నుంచి 1000 కిలోల వరకు బరువు తూగుతాను. నా రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. తోక మాత్రం ఉండదు.
గుండ్రంగా ఉంటా...
నేను మిగతా చేపల్లా కాకుండా కాస్త భిన్నంగా ఉంటా. దాదాపు గుండ్రని ఆకారంలో కనిపిస్తుంటాను. 1.8 మీటర్ల నుంచి 2.5 మీటర్ల వరకు పెరుగుతాను. కానీ మాలో ఓ చేప ఏకంగా 8.8 మీటర్ల వరకు పెరిగిందట. దాని బరువు కూడా దాదాపు 2,800 కేజీలంట!
నేను ఇతర చేపలు, సముద్ర జీవుల్ని ఆహారంగా తీసుకుంటాను. కిల్లర్ వేల్స్, షార్క్‌లు, సీల్స్... నాకు ప్రధాన శత్రువులు. జపాన్, కొరియా, తైవాన్లలో నా మాంసానికి భలే గిరాకీ. చక్కగా, ఎంతో రుచిగా ఉందని మీ మనుషులు లొట్టలేసుకుని మరీ తింటారంట!
'సొరచేపనని పొరబడుతుంటారు!
నేను ఎక్కువగా సముద్ర ఉపరితలాల్లోనే సంచరిస్తూ ఉంటాను. అప్పుడు నా రెక్కల్ని చూసి.. నన్ను సొరచేపనేమో అని పొరబడుతుంటారు. నేను ఎన్ని ఏళ్లు బతుకుతానో మీరు ఇప్పటికీ కచ్చితంగా తేల్చలేకపోయారు. పెద్దపెద్ద ఓషనేరియాల్లో మాత్రం దాదాపు పది సంవత్సరాల వరకు జీవించగలను.
హాని చేయను...
నేను భారీ ఆకారంలో పెరిగినప్పటికీ నావల్ల సముద్ర డైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను అస్సలు వారి జోలికి పోను. బుద్ధిగా నా పాటికి నేను ఉంటా. కానీ కొన్ని సార్లు నేను ఎగిరి చిన్న చిన్న పడవలపై పడుతుంటా. అప్పుడు మాత్రం నా వల్ల మనుషులకు, పడవలకు కాస్త ముప్పు వాటిల్లుతుంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బాహుబలి చేపనైన నా విశేషాలు. భలే ఉన్నాయి కదా! మీకు నచ్చాయి కదూ!