నేను వంకర ముక్కు పిట్టనోచ్!
హయ్ నేస్తాలూ... బాగున్నారా! నేనో పక్షిని. అలా అని మామూలు పిట్టను కాదు. వంకర మూతి పిట్టను. మీకు నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ! అయితే ఈ క్రథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.
నా పేరు లివీ పక్షి స్కార్లెట్ హనీక్రీపర్ అని కూడా పిలుస్తుంటారు. నేను హవాయి ద్వీపానికి 'చెందిన చాలా అరుదైన పక్షిని. ప్చ్... అయినా ఏం లాభం! అంతరించిపోతున్న పక్షుల జాబితాలో నేనూ ఉన్నాను. అది సరే కానీ... నాకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... అన్ని పిట్టల్లా కాకుండా 'నా ముక్కు వంకీ తిరిగి ఉంటుంది. పువ్వుల్లో మకరందాన్ని తాగడానికే ఈ ఏర్పాటు అన్నమాట.
నా ఆహారం పంటంటే...
నేను పువ్వుల్లో మకరందాన్ని పీల్చుకోవడంతోపాటు, చిన్న చిన్న కీటకాలనూ ఎంచక్కా హాంఫట్ చేసేస్తాను తెలుసా. మాలో ఆడపక్షి రెండు నుంచి మూడు గుడ్లు పెడుతుంది. చెట్ల కొమ్మలు, ఆకులు, రాలిపోయిన పక్షుల ఈకలతో మేం గూళ్లను తయారు చేసుకుంటాం. గుడ్ల నుంచి 14 రోజులకు పిల్లలు బయటకు వస్తాయి. వాటి ఆలనాపాలనా తండ్రి, తల్లిషక్షి రెండూ చూసుకుంటాయి.
ఎంతో గుర్తింపు...
ప్రాచీనకాలం నుంచి నాకు చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం నా ఈకలను దుస్తులు, కిరీటాల్లో అలంకరణ కోసం ఉపయోగించేవారు. నా ఈకలు చక్కని రంగులో, సుతి మెత్తగా ఉంటాయి. ప్రస్తుతం కూడా వీటికి డిమాండ్ ఎక్కువే వీటికోసమే మమ్మల్ని ఎక్కువగా వేటాడుతుంటారు. మా సంఖ్య పెరగకుండా, రోజురోజుకూ తగ్గిపోవడానికి ఇది కూడా కారణం. నేస్తాలూ... మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి.. బై... టై!