కిరీటం లేని క్రౌన్‌డ్ లేమర్...!
హాయ్ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ఏంటి 'దీన్ని ఎక్కడో చూసినట్లు ఉందే" అనుకుంటున్నారా? అవును నిజమే... కానీ నన్ను కాదు. మా జాతికి చెందిన వేరే జీవులను చూసి ఉంటారు. మా రూపం కాస్త ఒకేలా ఉంటుంది. ఈ కథనం చదివి నా వివరాలు కూడా తెలుసుకోండి...!
నా పేరు క్రౌన్‌డ్ లేమర్. నేను మడగాస్కర్‌కు చెందిన జీవిని. క్రౌన్‌డ్ లేమర్... అంటున్నారు. కానీ 'తల మీద కొప్పులాంటిదేం కనిపించట్లేదని ఆలోచిస్తున్నారు కదూ! అదేం ఉండదు పిల్లలూ...! నా తల మీద ముదురు నారింజ రంగులో కిరీటం ఆకారం ఉంటుంది. శరీరమంతా బూడిద, కళ్లు పసుపు రంగులో ఉంటాయి. నా కళ్ల చుట్టూ కాటుక పెట్టినట్లుగా అందంగా ఉంటుంది తెలుసా! కానీ కాస్త భయంకరంగానే ఉంటాను.
అవే తింటాను...!
నేను ఎక్కువగా గుంపులుగా ఉండటానికే ఇష్టపడతాను. పగటి సమయంలో కాస్త విశ్రాంతి తీసుకొని... సాయంత్రం పూట ఆహారాన్ని వెతుక్కోవడానికి ఆసక్తి చూపుతాను. నాకు చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం. నా ఆకారం పెద్దగా ఉందని... జంతువులను వేటాడి తింటాననుకోకండి. పువ్వులు, ఆకులు, పండ్లు, కొన్ని పక్షుల గుడ్లను ఆహారంగా తీసుకుంటాను. మా లేమర్ జాతిలో నేనే అతిచిన్న జీవిని తెలుసా! నేను పుట్టిన తర్వాత దాదాపు ఆరు నెలల వరకు అసలు ఎక్కడికీ వెళ్లను. అమ్మే అన్నీ చూసుకుంటుంది.
గుర్తుపెట్టుకుంటా...!
మీకో విషయం తెలుసా... నేను చాలా తెలివైనదాన్ని. ఏదైనా దారిని ఒకసారి చూస్తే చాలు ఇట్టే గుర్తు పెట్టుకుంటాను. వాసన ద్వారా ఇతర జంతువులను గుర్తించగలను. నా బరువు దాదాపు ? కిలోలు. పొడవు 81 నుంచి 88 సెంటీ మీటర్లు. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలను. సాధారణంగా అయితే 20 ఏళ్లు... రక్షణ కల్పిస్తే 88 సంవత్సరాల వరకు జీవించగలను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!