బెలూగా... భలే భలే బాహుబలి!



హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా! నేనో బాహుబలి చేపను. నాకు ప్రత్యేకతలూ చాలానే ఉన్నాయి. అవన్నీ మీతో చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరి నా విశేషాలేంటో తెలుసుకుంటారా! అయితే ఈ కథనం చదివేయండి ఫ్రెండ్స్‌... మీకే తెలుస్తుంది.

నా పేరు బెలూగా. బెలూగా స్టార్టన్‌, గ్రేట్‌ స్టార్టన్‌ అని కూడా పిలుస్తారు. నేను రష్యాకు చెందిన దాన్ని. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపను కూడా నేనే. ప్రస్తుతం రష్యాతోపాటు కజకిస్తాన్‌, అజర్‌బైజాన్‌, తుర్కెమెనిస్తాన్‌, ఇరాన్‌, మధ్య ఆసియాలో నా ఉనికి ఉంది. 1821లో వోల్లా నదిలో ఏకంగా 1571 కిలోలున్న మా ముత్తాత దొరికారంట. తర్వాత 1,220 కిలోలున్న బరువున్న మా 'బంధువొకరు కూడా మీకు చిక్కారట. ఇప్పటి వరకైతే ఇవే రికార్డులు. కానీ మమ్మల్ని విపరీతంగా వేటాడం వల్ల ఇప్పుడు మరీ ఇంత పెద్ద పెద్దవి దొరకడం లేవు. సాధారణంగా 19 నుంచి 264 కిలోల బరువున్నవి మాత్రమే లభ్యమవుతున్నాయి. కొంతకాలం క్రితం మాత్రం 8960 కిలోల బరువున్న మా స్నేహితుణ్ని పట్టుకున్నారట!

అత్యంత ఖరీదు!

ఆడ బెలూగాల గుడ్లకు చాలా డిమాండ్‌. ఖరీదు కూడా చాలా చాలా ఎక్కువ. వీటిని కేవియర్‌ అని పిలుస్తారు. ప్చ్‌... కానీ ఆడ బెలూగా చేపలు నాలుగు నుంచి ఏడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే గుడ్లను పెడతాయి. మా మాంసానికి మాత్రం, గుడ్లకు ఉన్నంత ప్రత్యేకత ఉండదు. కానీ ప్రస్తుతం అంతరించిపోతున్న జాబితాలో ఉండటం వల్ల అత్యంత ఖరీదైన చేపగా గుర్తింపు పొందాను. అక్రమ సాగు, కాలుష్యం మేం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఆనకట్టల నిర్మాణం వల్ల మా ఆవాసాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇది మా సంతానోత్పత్తి పై ప్రభావం చూపిస్తోంది.

ఏం తింటామంటే...

నేస్తాలూ.. మీకో విషయం చెప్పనా..! నా జీవితకాలం ఎంతో ఇప్పటి వరకు ఎవ్వరికీ కచ్చితంగా తెలియదు. కానీ మేం 100 సంవత్సరాలకు మించి బతకగలం అని శాస్త్రవేత్తల నమ్మకం. మాలో ఆడవి మగవాటికన్నా 20 శాతం పెద్దగా ఉంటాయి. మేం ఇంత భారీ శరీరాలతో ఉంటాం కదా! కానీ మీ మనుషులకు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి హానినీ కలిగించం. సాధ్యమైనంత వరకు మీకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తాం. చిన్న చిన్న చేపలు, ఇతర జలచరాలను ఆహారంగా తీసుకుంటాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. టై... టై...!

Responsive Footer with Logo and Social Media