వామ్మో... ఎంత పే...ద్ద చేపో!
చేపలు భలే ఉంటాయి కదూ! అక్వేరియంలో అటూ.. ఇటూ... తిరిగే వాటిని చూస్తుంటే... తెగ ముద్దొస్తాయి కదా! కానీ ఈ చేపను చూస్తే మాత్రం వామ్మో... అని భయపడతాం. కిలోనో రెండు కిలోలో కాదు... ఏకంగా రెండువందల కిలోల వరకు ఇవి పెరగడమే దీనికి కారణం... ఇంతకీ ఈ చేపల పేరేంటి? ఇవి ఎక్కడ ఉంటాయో... తెలుసుకోవాలని ఉంది కదూ! నేస్తాలూ ఇంకెందుకాలస్యం... చకచకా... ఈ కథనం చదివేయండి మరి!
అరపైమా గిగాస్... ఇదే ఈ బాహుబలి చేప పేరు. ఈ భారీ మీనం అమెజాన్ నదిలో జీవిస్తుంది. కొండలా ఉండే దీన్ని ఒక్కసారిగా చూస్తే వామ్మో... ఇది చేపా... లేక అనకొండా! అనే అనుమానం వస్తుంది. అతిపెద్ద మంచినీటి చేపల్లో ఇది ప్రధానమైనది. సాధారణంగా దీని పొడవు 200 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి దాదాపు 450 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. బాగా ఎదిగిన ఈ చేపలు ఏకంగా 200 కిలోల బరువు తూగుతాయి.
వీటికి మొప్పలున్నా... ఇంతటి భారీ శరీరానికి వాటిద్వారా అందే గాలి ఏ మాత్రం సరిపోదు. అందుకే ప్రతి పది, పదిహేను నిమిషాలకోసారి నీటి ఉపరితలానికి వచ్చి, ఊపిరి పీల్చుకుని వెళతాయి. ఈ మీనాల శరీరం బూడిద, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తోకపైన ఉన్న పొలుసుల మీద మాత్రం ఎరుపు, నారింజ రంగు ఉంటుంది. ఈ చేపల పొలుసులు చాలా గట్టిగా ఉంటాయి. ఇవే వీటిని ఫిరానా చేపల దాడుల నుంచి రక్షిస్తాయి.
ఈ చేపలదే 'పైచే'యి!
అమెజాన్ నదిలో చేపల సామ్రాజ్యంలో ఈ చేపలదే పై చేయి. బొలీవియా, బ్రెజిల్, గయానా, 'పెరూల్లోని అమెజాన్ జలాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. బొలీవియాలో ఈ చేపను పైచే అని కూడా పిలుస్తారు. అరపైమా గిగాస్ చేపలను మొట్టమొదట 1926లో కనుగొన్నారు. శాస్త్రవేత్తలు వీటిని ఆక్రమణ జాతిగా భావిస్తుంటారు. గతంలో వరదల వల్ల ఇవి పెరూ నుంచి కొట్టుకు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతుంటారు.
'చిన్న చేపను... పెద్ద చేప...!
చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ... ఇది స్వాహా... అది స్వాహా' అన్నట్లు ఇంతటి భారీ శరీరంతో ఉండే ఈ మీనాలు ఇతర జాతుల చేపల్ని, తమ జాతిలోనే చిన్న మీనాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇంకా ఇతర జలచరాలనూ తింటాయి. వీటి పిల్లలు మాత్రం కీటకాలు, లార్వాలతో తమ పొట్ట నింపుకొంటాయి.
వేటు వేస్తున్న వేట!
విపరీతమైన వేట కారణంగా అరపైమా గిగాస్ చేపల సంఖ్య గతంతో పోల్చుకుంటే విపరీతంగా పడిపోయింది. అందుకే 1990 నుంచి 1999 వరకు బ్రెజిల్‌లో ఈ చేపల వేట మీద పూర్తిగా నిషేధం విధించారు. తర్వాత నుంచి అనుమతించిన ప్రాంతాల్లోనే వీటి వేట కొనసాగుతోంది. ప్రస్తుతం వీటి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఈ బాహుబలి చేపల వల్ల ఇతర జాతుల చేపల సంఖ్యా తగ్గిపోతోందట. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఈ బాహుబలి చేప విశేషాలు. భలే ఉన్నాయి కదూ!