పాడమని నన్నడగవలెనా...!
హాయ్ నేస్తాలూ..! బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా.! మీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పి వెళ్దమని ఇలా వచ్చానంతే... ఇదేంటి చూడటానికి ఇంతే ఉంది... ఏం చెబుతుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపడినట్లే. వెంటనే ఈ కథనం చదివేయండి ఆ విశేషాలేంటో తెలిసిపోతాయి...
నా పేరు "సాంగ్ థ్రష్. పేరేంటి భలేగా ఉంది అనుకుంటున్నారా..! మరదే నా ప్రత్యేకత. నేను ఎక్కువగా జపాన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కనిపిస్తాను. చూడటానికి మీకు రోజు కనిపించే పక్షుల్లానే బ్రౌన్ కలర్‌లో ఉంటాను. మెడ కింది భాగంలో తెల్లని రంగుపైన నల్లని మచ్చలు ఉంటాయి. కాళ్లేమో లేత పసుపు రంగులో ఉంటాయి. నా రూపంలో లేదు కానీ.. నా గొంతులో ప్రత్యేకత ఉంది నేస్తాలూ..! నేను పాటలు పాడగలనన్నమాట. అందుకే నాకు 'సాంగ్ థ్రష్' అనే పేరు వచ్చింది. నేను వానపాములను ఆహారంగా తీసుకుంటాను. ఇంకా స్ట్రాబెర్రీలు కూడా ఇష్టంగా తింటాను. నేను పగలే ఎక్కువగా ఆహారాన్ని వెతుక్కుంటాను.
మిమిక్రీ కూడా...
సాధారణంగా పక్షులన్నీ గడ్డి, కట్టెలు, పీచుతో గూడు కట్టుకుంటాయి. కానీ నేను మాత్రం కొంత గడ్డితో పాటుగా బురద మట్టిని కూడా కలిపి నిర్మించుకుంటాను. దాదాపు 100 రకాల శబ్దాలు 'చేయగలను. మాలో ఆడ పక్షుల కంటే మగవే ఎక్కువగా పాటలు పాడతాయి. ఇంకో విషయం ఏంటంటే. మీ మనుషులు చేసే శబ్దాలు, టెలిఫోన్ సౌండ్, ఇతర పక్షుల అరుపులు లాంటివన్నీ మిమిక్రీ చేయగలం.
ముప్పేమీ లేదు...
ప్రస్తుతం మా జనాభా ఎక్కువగానే ఉంది. ఎలాంటి ప్రమాదమూ లేదు. నేను మూడు నుంచి పదేళ్ల వరకు జీవిస్తాను. బరువు 50 నుంచి దాదాపు 107 గ్రాముల వరకు తూగుతాను. పొడవు 20 నుంచి 24 సెంటీ మీటర్లు ఉంటాను. ఇవీ ఫ్రెండ్స్ నా విశేషాలు మీకు నచ్చాయి కదూ...!