కొ..కొ..కొ... నేనూ కోడినే!



హాయ్‌ ఫ్రెండ్స్‌... నా పేరు వెకా. మావోరి కోడి, వుడ్‌ హెన్‌ అనే పేర్లు కూడా నాకున్నాయి. న్యూజిలాండ్‌ నా స్వస్థలం. రెక్కలున్నా... ఎగరలేను. మరీ ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మాత్రం రెక్కలు టపటపలాడిస్తూ మామూలు కన్నా ఇంకాస్త వేగంగా పరిగెడతా. వానపాములు, లార్వాలు, చీమలు, సాలీళ్లు, నత్తల్లాంటి కీటకాలు, కప్పలు, ఎలుకలు, చిన్న చిన్న పక్షులు, ఆకులు, పండ్లు, విత్తనాలను ఆహారంగా తీసుకుంటాను.

మాలో ఆడ పక్షులు ఆగస్టు నుంచి జనవరి మధ్యలో మూడు వరకు గుడ్లు పెడతాయి. మీకో విచిత్రమైన విషయం చెప్పనా... మూమూలుగా అయితే కోళ్లలో ఆడవే గుడ్లను పొదుగుతాయి కదా! కానీ మాలో ఆడవాటితో పాటు, మగపక్షులూ పొదుగుతాయి తెలుసా! కేవలం పొదగడమే కాదు... ఆ పిల్లలు కాస్త పెద్దయ్యేంత వరకు వాటికి ఆహారం అందించడమూ రెండూ కలిసే చేస్తాయి. 'మగవి అరకిలో నుంచి కిలోన్నర వరకు బరువు తూగితే, ఆడవి 850 గ్రాముల నుంచి కిలో వరకు బరువుంటాయి.

ఇదంతా చదివాక మీకో అనుమానం వచ్చి ఉంటుంది. 'మీరు ఎగరలేరు కదా! మరి మీరు గూళ్లు ఎక్కడ కట్టుకుంటారు? ' ఇదేగా ఆ సందేహం! మేం ఎంచక్కా నేల మీదే గడ్డితో గూళ్లు నిర్మించుకుంటాం. పిల్లులు, కుక్కలు, ఫెర్రెట్స్‌ అనే పేరున్న ముంగిసల్లాంటి జీవులు మాకు ప్రధాన శత్రువులు. ఎలుకలు కూడా మా పక్షుల గుడ్లకు హాని తలపెడుతుంటాయి. ఇక కార్చిచ్చుల సంగతి సరేసరి! వీటన్నింటినీ తట్టుకుని మేం మనుగడ సాగిస్తున్నాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. బాగున్నాయి కదా! మీకు నచ్చాయి కదూ!

Responsive Footer with Logo and Social Media