పండు... పండు... బుజ్జి పండు... ఉవేరియా గ్రాండిఫ్లోరా దాని పేరు!



హాయ్‌ ఫ్రెండ్స్‌. ఈ చిత్రాలను చూసి, ఇవి అరటిపండ్లు అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇవి అరటి పండ్లు కాదు. వీటిని ఉవేరియా గ్రాండిప్లోరా అని పిలుస్తారు. ఇంతకీ ఇవేంటి? ఏఏ ప్రదేశాల్లో, ఏ దేశాల్లో కాస్తాయో తెలుసా!

చూడ్డానికి కాస్త బుజ్జి అరటిపండ్లలా ఉన్న ఈ ఫలాల పేరు ఉవేరియా గ్రాండిఫ్లోరా. ఇవి ఫిలిప్పీన్స్‌, చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌, వియత్నాం, న్యూగినియా, సుమిత్రా, మయన్మార్‌లో కనిపిస్తుంటాయి. ఆయా దేశాల్లో మళ్లీ ఈ ఫలాలకు వేరు వేరు పేర్లుంటాయి. ఫిలిప్పీన్స్‌ను వీటికి పుట్టినిల్లుగా చెబుతుంటారు.

బుజ్జి బుజ్జి ఫలాలు!

ఈ చెట్లలో చాలా రకాల జాతులున్నాయి. వీటి ఫలాలు కొంచెం బుజ్జి అరటిపండ్లలా అనిపిస్తాయి. కానీ... నిజానికి ఉవేరియా అంటే లాటిన్‌లో 'ద్రాక్ష అని అర్ధం. ఉవేరియా గ్రాండిఫ్లోరా చెట్లు పది మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. పండ్లు సాధారణంగా సుమారు 4 నుంచి 5.5 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. విత్తనాలు బూడిద రంగులో ఉంటాయి. పండులో ఇవి రెండు వరసల్లో కనిపిస్తుంటాయి.

ఎన్నో ఔషధ లక్షణాలు...

ఈ చెట్టు బెరడు, పత్రాలు, వేర్లలో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయని పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ క్యాన్సర్‌ కారకాలున్నాయని తేల్చారు. మలేషియాలో అయితే ఈ చెట్టు వేర్లు, పత్రాలను కడుపు నొప్పి నివారణ, చర్మ వ్యాధుల చికిత్సలో వాడతారట. పండ్లు కూడా రుచిగా ఉంటాయట. మొత్తానికి ఈ విశేషాలన్నీ భలేగా ఉన్నాయి కదా ప్రెండ్స్‌...

Responsive Footer with Logo and Social Media