రంగురంగుల కోతి
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు.. కోతులందు ఈ రెడ్ షాంక్ట్ డౌక్‌లు వేరు! రంగురంగులతో చూడ్డానికి భలే తమాషాగా ఉన్న ఈ కోతులు లావోస్, వియత్నాం, కంబోడియాలో కనిపిస్తాయి. వీటిలో మళ్లీ మూడు ఉప జాతులున్నాయి. ఇవి ఆకులు, పండ్లు, మొగ్గలు, పువ్వులు, విత్తనాలు, వెదురు రెమ్మలను ఆహారంగా తీసుకుంటాయి. కోతులు అనగానే మనకు అవి చేసే అల్లరి చేష్టలు గుర్తుకు వస్తాయి కదా! కానీ... వీటికి కాస్త క్రమశిక్షణ ఎక్కువే తిండి విషయంలో మిగతా కోతుల్లా ఇవి గొడవ పడవు. వాటికి దొరికిన ఆహారాన్ని ఎంచక్కా బుద్ధిగా పంచుకుంటాయి. పండ్లను ముక్కలుగా విరిచి మరీ ఒకదానికి మరోటి ఇచ్చి పుచ్చుకుంటాయి. ఈ జాతిలో మగ కోతులు సుమారు 8 నుంచి 11 కిలోలు, ఆడవి 6 నుంచి 10 కిలోల వరకు బరువు తూగుతాయి. తోక కూడా పొడవుగా ఉంటుంది. మగవాటికి మాత్రమే దాదాపు 12 సెంటీమీటర్ల పొడవైన తెల్లటి మీసాలుంటాయి. నారింజ, గోధుమ, నలుపు, ఎరుపు, తెలుపు రంగు వెంట్రుకలతో ఈ వానరాలు ఆకర్షణీయంగా ఉంటాయి.
రెడ్ షాంక్ట్ డౌక్‌లు సాధారణంగా 25 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, అక్రమ రవాణా, వేట కారణంగా ప్రస్తుతం ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటిని జూలలో ఉంచడం చాలా కష్టమైన పని. అందుకే ప్రపంచవ్యాప్తంగా కేవలం పదుల సంఖ్యల్లోనే ఇవి జూలలో ఆశ్రయం పొందుతున్నాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ వానరం విశేషాలు. భలే ఉన్నాయి కదూ!