చిన్నారి పొన్నారి తాబేలును నేను!



హాయ్‌ నేస్తాలూ బాగున్నారా! నా ఫొటోలు చూసి నేను పసి పాపాయిని అనుకుంటున్నారు కదూ! కానీ కాదు, నేను పూర్తిగా ఎదిగిన దాన్నే. “మరి... మరీ ఇంత చిన్నగా ఉండేంటబ్బా?' అని ఆలోచిస్తున్నారు కదూ! ఆ విశేషాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు చెర్సోబియస్‌ సిగ్నాటస్‌. పేరు ఇంత పెద్దగా ఉంది కదా! పరిమాణంలో మాత్రం నేను ప్రపంచంలోనే అతి చిన్న తాబేలును. దక్షిణాఫ్రికా నా స్వస్థలం. అవునూ! నా పేరు పిలవడానికి, పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదూ! మనం ఎలాగూ స్నేహితులమే కదా... ఎంచక్కా మీరు నన్ను బుజ్జి తాబేలు అని పిలిచేయండి సరేనా!

అరచేయంతే ఉంటానోచ్‌!

నేను ఎడారి తాబేలు రకానికి చెందిన జీవిని. అంటే నాకు ఈత రాదు. నేను నీటిలో జీవించను. నేల మీద చిన్న చిన్న రాళ్ల మధ్య బతుకుతాను. మొక్కలు, గడ్డిని ఆహారంగా తీసుకుంటాను. మాలో మగవి 8 నుంచి 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఆడవేమో 10 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అంటే మీ పెద్దవాళ్ల అరచేతుల్లో సరిపోతామన్నమాట. ఇక మా బరువు సుమారు 95 నుంచి 185 గ్రాముల మధ్య ఉంటుంది.

ముప్పు ముంగిట...

మా షెల్‌ గోధుమ రంగులో ఉంటుంది. మాలో ఆడవి తడి మట్టి నేలలో గుడ్లు పెడతాయి. వీటి నుంచి 100 నుంచి 120 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలు 1 గ్రాముల కంటే కూడా తక్కువ బరువుంటాయి. మేం ముప్పు ముంగిట ఉన్నాం. పర్యావరణ మార్పులు, ఇతర జంతువుల వేట, మీ మనుషులు మమ్మల్ని అక్రమ రవాణా చేయడం వల్ల మేం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోజు రోజుకూ మా సంఖ్య తగ్గిపోతోంది. మేం చాలా చిన్న జీవులం కదా... మిగతా తాబేళ్లలా తొందరగా పరిసరాలకు అనుగుణంగా మమ్మల్ని మేం వేగంగా 'మార్చుకోలేం. అందుకే వాతావరణ మార్పుల వల్ల మాలో చాలా తాబేళ్లు తమ ప్రాణాలు కోల్పో తున్నాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటా మరి.

Responsive Footer with Logo and Social Media