అరటి కాని అరటి... రెండుకోట్ల మంది ఆకలిని తీరుస్తోంది


హాయ్‌ ప్రెండ్స్‌... మనకు ఎన్నో పోషకాలుండే అరటిపండంటే భలే ఇష్టం కదూ! ఈ చిత్రంలో అరటిపండు పక్కనే కాస్త చిన్నగా ఉన్న వాటిని చూసి అవి కూడా బనానాలే అయి ఉంటాయి అనుకుంటున్నారు. కదూ... కానీ కాదు! ఈ పండ్ల పేరు ఎన్సెట్‌. ఈ చెట్టు అయితే అచ్చం అరటిలానే ఉంటుంది. అందుకే దీన్ని 'ఫాల్స్‌ బనానా' అని పిలుస్తుంటారు. ప్రస్తుతం దీన్ని ప్రపంచం మొత్తం మీద కేవలం ఇథియోపియాలో మాత్రమే సాగు చేస్తున్నారు. అరటి జాతికి చెందిందే అయినప్పటికీ ఈ పండు తినడానికి పనికిరాదు. కానీ ఈ చెట్టు బెరడు, ఆకుల మొదళ్లు, వేర్ల నుంచి స్థానికులు ప్రత్యేక పద్ధతుల్లో నార తీస్తారు. వాటిని ముందుగా ఆరబెట్టి, తర్వాత పులియబెడతారు. ఇలా వచ్చిన ఉత్పత్తితో జావ, రొట్టెలు చేసుకుంటారు.

ఆ రొట్టెల తయారీ కాస్త జొన్న రొట్టెలనే పోలి ఉంటుంది. ఇథియోపియాలో చాలామందికి ఇదే ప్రధాన ఆహారం. ఇలా దాదాపు రెండుకోట్ల మంది ఆకలిని ఈ చెట్టు తీరుస్తోంది. అన్నట్టు... దీని సాగుకు సీజన్లతో సంబంధం లేదు. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా పండించొచ్చు. అందుకే దీన్నిస్థానికంగా 'ఆకలి తీర్చే చెట్టు" అంటుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చాలావేగంగా జరుగుతున్నాయి కదా! ఈ నేపథ్యంలో ఈ ఎన్సెట్‌ పంట ఒక సూపర్‌ పుడ్‌ అవుతుందని ఇథియోపియా పరిశోధకులు చెబుతున్నారు. ఆఫ్రికా వ్యాప్తంగా ఎన్సెట్‌ను సాగు చేయగలిగితే సుమారు 10 కోట్ల మంది ఆకలిని అది తీర్చగలదని అంచనా వేస్తున్నారు.

Responsive Footer with Logo and Social Media