స్పేస్ భీమ్‌తో... మెప్పించింది...!
హాయ్ నేస్తాలూ...! పదేళ్ల వయసు పిల్లలంటే. ఏం చేస్తారు? 'ఏముంది...! రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చి... ఎంచక్కా ఆడుకుంటారు. హోంవర్క్. చేసుకుంటారు... కావాల్సినవి కొనిపెట్టమని మారాం చేస్తారు' అంతే కదా! కానీ ఓ చిన్నారి మాత్రం ఏకంగా రేడియో స్టేషన్‌కే మేనేజర్ అయింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజమే! మరి తనెవరో? ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే. వెంటనే ఈ కథనం చదివేయండి.
లండన్‌కు చెందిన మార్తా శీహన్‌కు పది సంవత్సరాలు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి తన ప్రతిభతో రేడియో స్టేషన్ మేనేజర్‌గా ఎదిగింది తెలుసా! మరో విషయం ఏంటంటే... తను ప్రపంచంలోనే 'యంగెస్ట్ రేడియో స్టేషన్ మేనేజర్' అట. ఫన్ కిడ్స్ రేడియో స్టేషన్ వారు.. పిల్లల కోసం 'ఫన్ కిడ్స్ స్పేస్ స్టేషన్' అనే కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్షం థీమ్‌తో దాన్ని పిల్లల ముందుకు తీసుకురావాలని వారు నిర్ణయించారు. మార్తా ఎప్పటి నుంచో... స్పేస్‌కి సంబంధించిన చిన్న చిన్న యాక్టివిటీలు చేస్తుండేదట. తన ఆలోచనా విధానం నచ్చడంతో, దానికి సంబంధించిన కంటెంట్ తయారు చేసే బాధ్యత ఆమెకు అప్పగించారు.. ఆ రేడియో యజమానులు.
నెలల్లోనే...!
స్పేస్ థీమ్‌తో... కంటెంట్ తయారు చేయడానికి మార్తాకు కొన్ని నెలల సమయం పట్టిందట. అందులో పిల్లలకు ఇష్టమైన ఫన్ గేమ్స్, ఇతర యాక్టివిటీలు, మ్యూజిక్ ఇలా... అన్నీ తనే డిజైన్ చేసిందట. 'మేము ఊహించిన దాని కంటే. మార్తా అంతరిక్షం థీమ్‌తో... చాలా చక్కని ఏర్పాట్లు చేసింది. ఇంత చిన్న వయసులోనే... తన ఆలోచనా విధానం చాలా గొప్పగా ఉంది' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు... ఆ రేడియో యజమానులు. ప్రస్తుతం ఆ రేడియో స్టేషన్‌ను మరింత అద్భుతంగా తయారు చేసే పనిలో ఉందట మార్తా. తన ప్రతిభను గుర్తించి... గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' వారు కూడా అందులో స్థానం కల్పించారు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్ కదూ!