పాండాల పుట్టినరోజు వేడుక…



హాయ్‌ నేస్తాలూ..! 'మీరు ఎప్పుడైనా పుట్టినరోజు వేడుక చేసుకున్నారా? ' ఏంటి ఆశ్చర్యంగా

ఉందా...!

'ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం కదా? మళ్లీ కొత్తగా అడగటం ఏంటి?" అనుకుంటున్నారు కదూ!

మనం పుట్టినరోజు చేసుకోవడం లేదా ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులకు చేయడంలో వింతేమీ లేదు.

కానీ... ఓ చోట పాండాలకు పుట్టినరోజు వేడుకలు జరిపారు. మరి అదెక్కడో.. ఆ వివరాలేంటో

తెలుసుకుందామా! అయితే వెంటనే ఈ కథనం చదివేయండి.

చైనాలోని చిమెలాంగ్‌ సఫారీ పార్క్‌లో మెంగ్‌ మెంగ్‌, షుయై షుయై, కుకు అనే మూడు కవల పాండాలు ఉంటాయి. అవి ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న కవల పాండాలట. వాటికి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా... ఆ జూపార్క్‌ వాళ్లు... పుట్టినరోజు వేడుకను నిర్వహించారట. 'మన పుట్టినరోజు అయితే.. కేక్‌ కట్‌ చేస్తాం... మరి అవేం చేస్తాయి?" అనే సందేహం మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది కదూ! ఇప్పుడు అదే తెలుసుకోబోతున్నాం పిల్లలూ!

నచ్చిన ఆహారంతోనే...!

సహజంగా పాండాలు వెదురు చెట్లు, క్యారెట్‌ ఇంకా కొన్ని రకాల పండ్లు, తేనె... ఆహారంగా తీసుకుంటాయి కదా! వాటితోనే... ప్రత్యేకమైన కేక్‌లను తయారు చేయించి... జులై 29న వాటికి పుట్టినరోజు వేడుకలు చేశారట. అంతే కాదు నేస్తాలూ.. అక్కడికి వచ్చే పర్యాటకులు వాటి కోసం ప్రత్యేకంగా పుట్టినరోజు పాటను కూడా పాడారట. పాండాలకు పుట్టినరోజు నిర్వహించడం కొత్తగా ఉంది కదూ! ఇంకో విషయం ఏంటంటే. ప్రపంచంలో ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే... మూడు కవల పాండాలు జన్మించాయట. అందులోనూ... ఇవి మూడే ఎక్కువ కాలం బతికి ఉన్నాయట. అందుకే వీటికి ప్రత్యేకంగా... జన్మదిన వేడుకలు చేశారట. దాంతో అవి... 'గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించాయి. ఈ విశేషాలు భలేగా ఉన్నాయి కదా నేస్తాలూ!

Responsive Footer with Logo and Social Media