కప్పను కాదు... చేపనే నేను!
నా పేరులో కప్ప ఉంటుంది కానీ... నేను కప్పను కాదు. నిజానికి నేనో సముద్ర చేపను. అలా అని మామూలు చేపను కాదు. నా తీరే వేరు. నేస్తాలూ...! ఆ వివరాలన్నీ మీకు తెలుసుకోవాలని ఉంది కదూ! నా విశేషాలన్నీ మీకు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను.
నా పేరు హెయిరీ ఫ్రాగ్ ఫిష్. నాకు స్ట్రైటెడ్ ప్రాగ్ ఫిష్ అనే పేరు కూడా ఉంది. యాంటెన్నారిడే కుటుంబానికి చెందిన చిన్న సముద్ర చేపను. నేను 22 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నాకు మృదువైన చర్మం ఉంటుంది. అది వెంట్రుకలను పోలి ఉంటుంది. అందుకే నన్ను హెయిరీ ప్రాగ్ ఫిష్ అని పిలుస్తారు. పరిసరాలకు అనుగుణంగా రంగులు మార్చే సామర్థ్యమూ నాకూ ఉంది. ఎరుపు రంగులో ఉన్న నేను ఎక్కువగా గోధుమ, నారింజ రంగులోకి కూడా 'మారుతుంటాను. ఇంకా... ఆకుపచ్చ, బూడిద, గోధుమ, తెలుపు, నలుపు రంగులోకి కూడా 'మారుతుంటాను.
అమాంతం మింగేస్తా...
“ఎందుకలా కప్పలా నోరు తెరుస్తున్నావు' అని అనుకోవడం మీరు వినే ఉంటారు కదా! ఆహారం తీసుకోవడం కోసం కూడా నా నోరు చాలా పెద్దగా తెరుస్తాను. దాదాపు నా శరీరమంత 'పరిమాణమున్న జీవుల్ని కూడా అమాంతం మింగేయగలను. నేను ఎక్కువగా చేపల్ని ఆహారంగా తీసుకుంటాను. కొన్నిసార్లు తోటి హెయిరీ ప్రాగ్ ఫిష్‌లను కూడా తినేస్తాను.
ఎక్కడ ఉంటానంటే...
నేను హిందు మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఉష్ణమండల, ఉప ఉష్ణమండల జలాల్లో జీవిస్తుంటాను. ఇంకా ఆఫ్రికా, పశ్చిమ తీరంలోని అట్లాంటిక్ మహాసముద్రం, న్యూజెక్సీ తీరం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో సహా దక్షిణ బ్రెజిలియన్ తీరం వరకు కనిపిస్తుంటాను. మధ్యదరా, ఆర్కిటిక్ జలాల్లో మాత్రం జీవించను.
ఇబ్బందులు తప్పడం లేదు...
నేను మరీ లోతులేని, ఇసుక, రాతి సముద్ర జలాలు, పగడపు దిబ్బల ప్రాంతాల్లో జీవిస్తుంటాను. సముద్రం ఉపరితలం నుంచి సగటున 40 మీటర్ల నుంచి 210 మీటర్ల లోతులో బతుకుతుంటాను. సముద్ర జలాలు వేడెక్కుతుండటం, కలుషితం అవుతుండటం వల్ల మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆక్సిజన్ స్థాయులు తగ్గుతుండటం వల్ల పగడపు దిబ్బల్లో బతికే ఇతర చేపల సంఖ్య తగ్గుతోంది. దీని వల్ల మాకు సరైన ఆహారం దొరకడం కష్టంగా మారుతోంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదా! మీకు నచ్చాయి కదూ!