ఈ చిన్నారిది తుపాను వేగం!



హాయ్‌ నేస్తాలూ...! స్కేటింగ్‌ మనందరికీ పరిచయమే కదా! స్వయంగా మనం 'చేయకపోయినా..మన స్నేహితులో, ఇంకెవరైనా చేస్తుంటే. చూసే ఉంటాం. చూడటానికి... 'భలేగా ఉందే... చాలా సులభంగా ఉన్నట్లుంది' అనిపిస్తుంది. కానీ... అలా ఏం ఉండదు పిల్లలూ! కష్టంగానే ఉంటుందట. అయినా కూడా ఓ చిన్నారి అందులో రికార్డు సాధించింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా...!

పశ్చిమ బెంగాల్‌కు చెందిన విదుషి అగర్వాల్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి రోలర్‌ స్కేటింగ్‌లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. తన వయసు పిల్లలంతా... ఖాళీ దొరికితే చాలు టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. కానీ విదుషి మాత్రం తన స్కేటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తనే ముందు...

మీకో విషయం తెలుసా! పశ్చిమ బెంగాల్‌లో... అండర్‌- 14 విభాగంలో రోలర్‌ స్కేటింగ్‌లో పతకాలు సాధించిన వారిలో తనే మొదటి అమ్మాయట. తను ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. 200, 500 మీటర్ల పోటీల్లో కాంస్య పతకాలు, 1000 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించింది. తనకు నాలుగేళ్లు ఉన్నప్పుడే శిక్షణ తీసుకోవడం ప్రారంభించిందట. కేవలం 20 నిమిషాల 50 సెకన్లలో... 200 మీటర్ల దూరం ఇన్‌లైన్‌ స్కేటింగ్‌ చేస్తూ... 50 అప్స్‌ అండ్‌ డౌన్స్‌ కూడా చేసింది. ఇంతటి ప్రతిభ కనబర్చిన ఈ చిన్నారికి "ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌' వారు అందులో స్థానం కూడా కల్పించారు. వాళ్ల అక్క కషిశ్‌ కూడా స్కేటింగ్‌లో రాష్ట్ర స్థాయిలో పతకాలు అందుకుందట. ఆమె స్ఫూర్తితోనే మన విదుషికి స్కేటింగ్‌ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిందట.

పొద్దున్నే నిద్రలేచి...

“ఉదయం 4:30 గంటలకే నిద్ర లేచి... స్కేటింగ్‌ చేయడం ప్రారంభిస్తుంది. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చాక... శిక్షణ తీసుకోవడానికి వెళ్తుంది. దీంతో పాటుగా తను భరత నాట్యం, స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌ కూడా నేర్చుకుంటుంది' అని వాళ్ల నాన్న కృష్ణ చెబుతున్నారు. భవిష్యత్తులో అత్యుత్తమ 'స్కేటర్‌గా ఎదగడమే తన లక్ష్యమట. మరి విదుషికి మనమూ “ఆల్‌ ది బెస్ట్‌' చెప్పేద్దామా!

Responsive Footer with Logo and Social Media