బాహుబలి బైక్!
అదో బాహుబలి బైక్. ఆకారమేమో కొండంత. హార్స్‌పవరేమో ఏనుగంత! బరువేమో టన్నుల్లో! వాడిన విడిభాగాలేమో... సోవియట్ యుద్ధట్యాంక్‌వి. బైక్ చేసే మోతేమో... చెవులు చిల్లులు పడేంత, రికార్డేమో.. రెండు దశాబ్దాలుగా... ఉక్కులా చెక్కు చెదరనంత! మరి ఈ వింత ద్విచక్రవాహనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా! ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి!
ప్రపంచంలోనే అత్యంత బరువైన ఈ ద్విచక్రవాహనం పేరు పంజర్‌టైక్. దీని బరువు ఏకంగా అయిదు టన్నులకు పైనే ఉంది. దీన్ని జర్మనీకి చెందిన టైలో, విల్‌ఫ్రెడ్ నైబెల్ అనే ఇద్దరు అన్నదమ్ములు తయారు చేశారు. సోవియట్ టీ- 55 అనే యుద్ధట్యాంక్ ఇంజన్‌తో దీన్ని ఇరవై సంవత్సరాల క్రితమే రూపొందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలోనే అతి బరువైన బైక్‌గా “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కొనసాగుతోంది.
మూడేళ్ల ఎదురు చూపులు!
టైలో, విల్‌ఫ్రెడ్ సోదరులు ఈ బైక్ తయారీకి అవసరమైన సోవియట్ యుద్ధట్యాంక్ టీ- 55 ఇంజన్ కోసమే దాదాపు మూడు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత వీరు మరికొన్నేళ్లు ఈ బైక్ తయారీలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వీరి కృషి ఫలితంగా చివరికి 88,000 సీసీ సామర్థ్యమున్న టీ-55 ఇంజన్‌తో బైక్ సిద్ధమైంది. దీనిలోని భాగాలన్నీ సైనిక వస్తువులతో తయారైనవే కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే. దీని తయారీదారులు మాత్రం దీన్ని శాంతికి చిహ్నంగా చెబుతుంటారు.
కొన్ని వేల గంటలు...
ఈ బాహుబలి బైక్ తయారీకి టైలో, విల్‌ఫ్రెడ్ సోదరులు దాదాపు 5,000 గంటలు కేటాయించారు. ఈ సమయంలో ఏకంగా 120 కిలోల వెల్డింగ్ వైర్‌ను వాడారు. ఇంత భారీ బైక్‌ను నడపాలంటే చాలా కష్టం. అందుకే దీన్ని డ్రైవ్ చేయాలంటే కచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే. ఇంజన్ స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల వారి చెవులు చిల్లులు పడాల్సిందే. నేస్తాలూ మొత్తానికి ఇవే బాహుబలి బైక్ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!