పింఛం వంటి తోక నాది…



హాయ్‌ నేస్తాలూ..! మనం ఇప్పటి వరకు చాలా రకాల పక్షులను చూసి ఉంటాం, కానీ వాటన్నింట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కాస్త ప్రత్యేకం. అదేమిటంటే. దాని తోక! అది నెమలి పింఛం ఆకారంలో ఉంటుంది. 'అది చూస్తేనే తెలుస్తోంది కదా!' అనుకుంటున్నారా. తన గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి అది ఇలా మన ముందుకు వచ్చింది. మరి దాని మాటల్లోనే ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...!

నన్ను 'గ్రేటర్‌ సేజ్‌ గ్రౌజ్‌ అని పిలుస్తారు. అమెరికాకు చెందిన జీవిని. అక్కడ తప్ప, నేను ఇంకెక్కడా కనిపించను. మా ప్రాంతంలో.. అలాగే మా జాతిలో నేనే అతిపెద్ద పక్షిని తెలుసా! మా జాతిలో దాదాపు 2 వేల రకాలున్నాయి. నేను ఎక్కువగా గుంపులుగా ఉండటానికే ఇష్టపడతాను. మాలో మగ, ఆడ పక్షులను ఇట్టే గుర్తు పట్టేయొచ్చు. ఎందుకంటే... మగ వాటికి మెడ దగ్గర పసుపు.. ఆడ వాటికి బూడిద రంగు ఉంటుంది. శరీరం కింది భాగం తెలుపు రంగులో ఉంటుంది. రెక్కలు, తోక మీద.. తెలుపు, బ్రౌన్‌ రంగు మచ్చలు ఉంటాయి.

భలే తోక...!

నా తోక ఒక చిన్ని నెమలి పింఛంలా ఉంటుంది తెలుసా! కానీ అన్నిసార్లు అలాగే ఉండదు. కొన్నిసార్లు తోకను ముడుచుకుంటాను కూడా! మాలో మగ పక్షులు ఆడ వాటి కంటే కాస్త పెద్దగా ఉంటాయి. నేను ఆకులు, పండ్లు, పువ్వులు, విత్తనాలనే ఆహారంగా తీసుకుంటాను. ఏ జంతువుల జోలికీ వెళ్లను.

ఎగరడం నచ్చదు...!

నేను ఎక్కువగా నేల మీదే తిరుగుతుంటాను. నాకు ఎగరడం పెద్దగా ఇష్టం ఉండదు. నా ఆకారం కూడా కాస్త పెద్దగా ఉండటంతో ఎక్కువసేపు ఎగరలేను. ఏదైనా ప్రమాదం ఎదురైనా... నేల మీద ఏ చెట్ల చాటుకో వెళ్లి దాక్కుంటాను. నా బరువు 1 నుంచి 8 కిలోల వరకు ఉంటుంది. ఎత్తు 60 సెంటీ మీటర్లు. ప్రస్తుతం మా సంఖ్య బాగానే ఉంది. పదేళ్ల వరకు జీవించగలను. ఇవీ నా విశేషాలు మీకు నచ్చాయి కదూ!

Responsive Footer with Logo and Social Media