కొ..కొ.. కోడి.. తో..తో.. తోక!



కోడి పుంజంటే రాజసం! సై... అంటే సై... అని కాలు దువ్వే పౌరుషం! కొక్కొరక్కో... కొక్కొరక్కో... అని కూత పెట్టే కంఠం! టపటప టపటపమని రెక్కలు చేసే శబ్దం... ఇవే గుర్తొస్తాయి మనకు. కానీ జపాన్‌ దేశానికే ప్రత్యేకమైన ఓ జాతి కోడిపుంజుకు వీటన్నింటితో పాటు మరో వింత లక్షణమూ ఉంది. అదేంటో తెలుసుకుందామా మరి!

ఈ అరుదైన కోడి జాతి పేరు ఒనగడోరి. వీటిలో పుంజులకు చాలా పొడవైన తోక ఉంటుంది. ప్రపంచంలో మరే కోడి జాతికి కూడా ఇలాంటి తోక లేదు. అసలు దీని పేరులోనే దీని గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఒనగడోరి అంటే గౌరవప్రదమైన కోడి అని అర్థమట!

ఎంతో గౌరవం...

ఒనగడోరి జాతి కోడికి జపాన్‌లో ప్రత్యేక గౌరవం ఉంది. 1958 సంవత్సరంలో దీనికి 'నేషనల్‌ ట్రెజర్‌ అనే గుర్తింపు కూడా లభించింది. ప్చ్‌... ఇంత గౌరవం దక్కినా... ఇది ప్రమాదం అంచునే ఉంది. ఎందుకంటే అంతరించి పోతున్న పక్షి జాబితాలో ఉంది. ప్రస్తుతం ఈ జాతి కోళ్లు కేవలం 250 మాత్రమే ఉన్నాయి.

పెరుగుతూనే ఉంటాయి...

ఈ జాతి కోళ్ల తోకలు వాటి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. తోక సగటు పొడవు 4 నుంచి 9 మీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఒక కోడిపుంజుకు మాత్రం ఏకంగా 13 మీటర్ల తోక ఉంది. ఇప్పటివరకు ఇదే రికార్డు! ఈ పొడవైన తోకల కారణంగానే వీటిని పొడవైన బోన్లలో పెంచుతుంటారు. అలాగే వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.

ఎగుమతికి లేదు అనుమతి!

ఒనగడోరి కోడి గుడ్లను జపాన్‌ దేశం నుంచి బయటకు తీసుకెళ్లడానికి చట్టం ఒప్పుకోదు. ఒక వేళ ఎవరైనా అలా చేయాలని చూస్తే... దాన్ని అక్రమరవాణా కింద పరిగణిస్తారు. చట్టప్రకారం వారిని శిక్షిస్తారు. అలాగే ఈ దేశంలో ఈ కోళ్లను చంపడం, అమ్మడం కూడా నేరమే! ఈ కోళ్లలో పుంజులు సగటున 1.8 కిలోల వరకు బరువు తూగుతాయి. పెట్టలేమో 1.85 కిలోల వరకు బరువు పెరుగుతాయి. సాధారణంగా ఈ కోళ్ల చర్మం లేతపసుపురంగులో ఉంటుంది. పెట్టలు లేత గోధుమరంగులో గుడ్లు పెడతాయి. కొందరు వీటిని ఫీనిక్స్‌ కోళ్లు అని కూడా పిలుస్తారు. కానీ నిజానికి ఈ కోళ్లకు ఫీనిక్స్‌ పక్షులకు అసలు సంబంధం లేదు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ పొడవైన తోకున్న కోడిపుంజుల విశేషాలు భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media