చిట్టి చేతులు చేసిన అద్భుతం ఇది!
హాయ్ నేస్తాలూ...! రూబిక్ క్యూబ్స్‌ని మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. వాటితో ఆడుకుంటూనే ఉన్నాం. అంతే కదా! వాటితో చాలా మంది రకరకాల విభాగాల్లో రికార్డులు సాధిస్తున్నారు. అలాగే వినూత్నంగా ఆలోచించిన ఓ బుడతడు కూడా రికార్డు పట్టాడు. మరి తనెవరు ఆ వివరాలేంటో తెలుసుకుందామా...!
తమిళనాడులోని రామాంతపురానికి చెందిన ఎ.మహ్మద్ అహషాన్‌కు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నారి తన ప్రతిభతో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. రూబిక్ క్యూబ్స్‌తో 80 దేశాల జాతీయ జెండాలను రూపొందించి... అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వినడానికి కాస్త వింతగా ఉన్నా, ఇది నిజమే నేస్తాలూ..! అది కూడా కేవలం మూడు నిమిషాల్లోనే పూర్తిచేశాడు. తన ప్రతిభను గుర్తించిన.. 'వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 'కలామ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వారు అందులో స్థానం కూడా కల్పించారు. ఇంకో విషయం ఏంటంటే. ఇప్పటి వరకు ఈ విభాగంలో రికార్డు సాధించిన వారిలో తనే అతిచిన్న వయస్కుడట.
చిన్నప్పటి నుంచే...!
మొదట్లో రూబిక్ క్యూబ్స్‌తో సరదాగానే ఆడుకున్నా... తర్వాత పట్టుదలతో వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించేవాడట. సాధారణంగా తన వయసు పిల్లలంతా... ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడానికి, కార్టూన్స్ చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ మన అహషాన్ మాత్రం తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే... క్యూబ్స్ సాల్వ్ చేయడం నేర్చుకోవడం కోసం గంటల సమయం వెచ్చించేవాడట.
మరిన్ని రికార్డులు...
"మనకు ఏదైనా పని నచ్చితే... దాని కోసం ఎంత కష్టపడినా అస్సలు కష్టం అనిపించదు. నాకు క్యూబ్స్ సాల్వ్ చేయడం ప్రారంభించాకే ఆ విషయం తెలిసింది. అలా కష్టపడితేనే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం. భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలనేదే నా కోరిక అని చెబుతున్న అహషాన్‌కు మనమూ 'ఆల్ ది బెస్ట్' చెప్పేద్దామా...!