ఈ నేస్తం... అన్‌స్టాపబుల్‌...!



హలో ఫ్రెండ్స్‌... సాధారణంగా తొమ్మిదేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు? - కార్టూన్‌ బొమ్మలు చూస్తూ, క్రికెట్‌ ఆడుతూ ఇష్టంగానో కష్టంగానో బడికి వెళ్లివస్తుంటారు. కానీ, ఓ నేస్తం మాత్రం 'పెయింటర్‌గా ప్రపంచఖ్యాతి గడించాడు. తను వేసిన బొమ్మలకు లక్షల్లో ధర పలుకుతోంది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

మహారాష్ట్రలోని పుణెకు చెందిన అద్వైత్‌కు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు. ఇటీవల ఓ సంస్థ ప్రకటించిన 'అన్‌స్టాపబుల్‌21” జాబితాలో ఈ నేస్తం చోటు దక్కించుకున్నాడు. అంటే. 21 ఏళ్లలోపు వయసున్న అత్యంత ప్రతిభావంతులైన 21మంది అన్నమాట. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో... న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన వారిలో అద్వైత్‌ కూడా ఒకరు.

లక్షల్లోనే ధర...

ఎనిమిది నెలల వయసులో పుడ్‌ కలర్స్‌తో ఆడుకున్న ఈ నేస్తం... ఇటీవల గీసిన ఓ 'పెయింటింగ్‌ను వేలంలో రూ.18 లక్షలకు దక్కించుకున్నారు. అలా ఇప్పటివరకూ అద్వైత్‌ గీసినవన్నీ దాదాపు రూ.2 కోట్ల 48 లక్షల విలువ చేశాయట. వివిధ దేశాల్లోని ప్రముఖ ఆర్ట్‌ గ్యాలరీల్లో మొత్తం 19 ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశాడు. వాటిల్లో తను గీసిన బొమ్మలను ప్రదర్శనగా ఉంచాడు.

సొంతంగా నేర్చుకొని...

అద్వైత్‌ వాళ్ల అమ్మ కూడా పెయింటరే. నాన్నేమో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. తల్లిని చూస్తూ పెరగడంతో చిన్నతనంలోనే డ్రాయింగ్‌ పట్ల ఆసక్తి ఏర్పడింది. అలా సొంతంగానే రంగులతో రకరకాల పెయింటింగ్స్‌ గీసేవాడు. కొడుకు ఇష్టాన్ని గుర్తించి, తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. పెయింటింగ్‌కు శిక్షకుడిని నియమించినా, ఎక్కడైనా క్లాసులో చేర్చించినా... తన సహజజైలిని కోల్పోతాడేమోనని ఇంట్లోనే సాధన చేయించారు. అలా రెండేళ్ల వయసులోనే తను గీసిన బొమ్మలను స్థానికంగా ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. నాలుగేళ్లకే కెనడాలోనూ మరో ఆర్ట్‌ గ్యాలరీలో తన పెయింటింగ్స్‌ను ప్రదర్శనగా ఉంచారు. మన దగ్గరైనా, విదేశాల్లోనైనా ఈ నేస్తం వేసిన బొమ్మలకు చాలా డిమాండ్‌ ఉందట. పికాసోలాంటి ప్రముఖుల జీవిత విశేషాలకు సంబంధించిన పుస్తకాలనూ చదవడం ప్రారంభించాడని తల్లిదండ్రులు గొప్పగా చెబుతున్నారు.

ఇతర హాబీలూ...

చదువు, పెయింటింగే కాకుండా అద్వైత్‌కు ఇతర ఆసక్తులూ ఉన్నాయట. స్నేహితులతో కలిసి పుట్‌బాల్‌ ఆడటం, బొమ్మ డైనోసార్లు, లెగో బ్రిక్స్‌తో సరదాగా గడుపుతుంటాడట. చిన్నప్పుడు ఎవరైనా ఏం కావాలంటే కలర్‌ పెన్సిళ్లు, పెయింటింగ్స్‌ మాత్రమే చాలని చెప్పేవాడట. నేస్తాలూ.. చిన్న వయసులోనే 'అన్‌స్టాపబుల్‌21లో ఒకరిగా నిలవడం మాటలు కాదు కదా... అందుకే ఈ నేస్తానికి మనమూ కంగ్రాట్స్‌ చెప్పేద్దాం!

Responsive Footer with Logo and Social Media