నా మెడలోనూ విషమే!
హాయ్ నేస్తాలూ... బాగున్నారా! నేనో విచిత్రమైన పామును. నా పేరు రాజ్జోఫిస్ టైగ్రినస్. నన్ను టైగర్ కీల్‌బ్యాక్ అని కూడా పిలుస్తుంటారు. యమకాగాషి క్కోట్‌బేమ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా రష్యా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనా, తైవాన్, వియత్నాం, జపాన్, మలేసియాలో కనిపిస్తుంటాను. దాదాపు 80 నుంచి 100 సెంటీమీటర్ల వరకు పొడవు 'పెరుగుతాను. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు రంగులు నా శరీరం మీద ఉంటాయి. చిన్న చిన్న మార్పులతో మళ్లీ మాలో మరికొన్ని రకాల సర్పాలూ ఉన్నాయి.
నాకో ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే... నేను విషపూరిత సర్పన్నే అయినప్పటికీ... మాలో చాలా రకాలు సొంతంగా విషాన్ని తయారు చేసుకోలేవు. దీనికో చిన్న కిటుకు ఉంది. మేం ఎక్కువగా కప్పలను ఆహారంగా తీసుకుంటాం. ఇందులో కొన్ని విషపూరితమైనవీ ఉంటాయి. వాటిని తిన్నప్పుడు ఆ విషాన్ని మేం స్వీకరించి నిల్వ చేసుకుంటాం. మరో విచిత్రమైన విషయం ఏంటంటే... ఈ విషం కేవలం మా కోరల్లోనే కాదు... మా మెడ దగ్గర ఉండే గ్రంథుల్లోనూ జమ చేసుకుంటాం. ఇలా ఎందుకంటే. మేం ఏదైనా జీవి మీద దాడి చేయాలనుకుంటే కోరల్లో ఉన్న విషాన్ని వాడతాం. అదే వేరే ఏదైనా ప్రాణి మా మీద దాడి చేయాలని చూస్తే మెడ దగ్గర గ్రంథుల్లో ఉండే విషం మాకు రక్షణ కల్పిస్తుంది. అంటే మేం తీసుకునే ఆహారమే మాకు రక్ష అన్నమాట. సాధారణంగా 'మీ మనుషులను ఏమీ అనను. నా జోలికి వస్తే మాత్రం కాటేస్తాను. ఒకవేళ నేను కాటేయక 'పోయినా.. నన్ను మీరు పట్టుకున్నారే అనుకోండి... అప్పుడు నా మెడ దగ్గర ఉన్న గ్రంథుల్లోంచి విషం బయటకు వస్తుంది. ఇది కనక మీ కళ్లలో పడిందో... మీరు చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై...!