పిట్ట కొంచెం... తోక ఘనం!



హలో ఫ్రెండ్స్‌...! ఏంటి? దీని ఆకారం చూస్తే... చిన్నగా ఉంది. తోక మాత్రం బారెడు పొడవుంది. ఇంతకీ ఈ తోక సహజంగా వచ్చిందేనా? లేక ఎవరైనా అతికించారా?” అని ఆలోచిస్తున్నారు కదూ! నాకు అర్థమైంది నేస్తాలూ.. అందుకే మీ సందేహాలన్నీ తీర్చి, నా గురించి మరికొన్ని వివరాలు

చెప్పి పోదామని ఇదిగో ఇలా వచ్చాను.

నాపేరు ఇండియన్‌ ప్యారడైస్‌ ఫ్రైక్యాచర్‌. పలకడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కదూ! మరేం ఫర్వాలేదు, మీరు ఎంచక్కా తోక పిట్ట అని పిలిచేయండి. నేను... పలికేస్తా సరేనా. ఇంతకీ నేను ఎక్కడుంటానో చెప్పలేదు కదా... మీ దేశంతో పాటుగా... చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాను. నేను చూడటానికి కాస్త అందంగానే ఉంటాను. మా శరీరం బ్రౌన్‌ రంగులో, మెడ చుట్టు భాగం, కళ్లు నలుపు రంగులో ఉంటాయి. మాలో కొన్ని మగ పక్షులు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. వాటి కళ్లు, మెడ చుట్టూ నీలం రంగులో ఉంటుంది. పొడవైన తోక...!

నాకు కచ్చితంగా ఇదే ఆహారం కావాలని ఏం లేదు నేస్తాలూ..! ఏది అందుబాటులో ఉంటే అది తినేసి... బొజ్జ నింపుకుంటా. పగలు, సాయంత్రం సమయాల్లోనే నాకు కావాల్సిన ఆహారం వెతుక్కుంటాను. రాత్రి అది తిని ఎంచక్కా నిద్రపోతాను. మొదట్లో నా తోక చిన్నగానే ఉంటుంది. కానీ... రెండు మూడేళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 80 సెంటీ మీటర్ల వరకు పెరుగుతుంది.

ఎగరడం ఇష్టం...

నా తోక చూడటానికి భలే ఉంది అనిపించినా... కొన్నిసార్లు ఎగరడానికి నాకు కష్టంగా ఉంటుంది. నేను అస్సలు ఒకచోట ఉండను. ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాను. నాకు ఎగరడం అంటే చాలా ఇష్టం. మీకో విషయం తెలుసా... చిన్నచిన్న శబ్దాలు చేస్తూ... మాలో మేము మాట్లాడుకుంటాం కూడా. మేం గుడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పన్నెండు రోజుల 'వరకు గూడు నుంచి బయటకే రాము. ప్రస్తుతానికి మా మనుగడకు ఎలాంటి ఇబ్బందీ లేదు. 18.5 నుంచి 22 గ్రాముల వరకు బరువుంటాను. 5 నుంచి 8 సంవత్సరాల వరకు జీవించగలను. మొత్తానికి ఇవీ నేస్తాలూ.. నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ...

Responsive Footer with Logo and Social Media