దీని పేరు పావో మ్యూటికస్‌!



హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎలా ఉన్నారు. ఏంటి అలా అవాక్కవుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో నెమలి చిత్రాలున్నాయి. కానీ దీని పేరు 'పావో మ్యూటికస్‌' అంటున్నారు... అని కాస్త గందరగోళానికి గురవుతున్నారు. కదూ! అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి మరి.

ఇది నెమలే! కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు తేడా తెలుస్తుంది. మన దగ్గర కనిపించే నెమళ్లు గొంతు, మెడ దగ్గర నీలి రంగుతో ఉంటాయి. కానీ ఈ నెమలి మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. అందుకే దీనికి ఆకుపచ్చ నెమలి అనే పేరు వచ్చింది. ఇండోనేషియా నెమలి, పావో మ్యూటికస్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. మనకు ఎలాగైతే నెమలి జాతీయపక్షే... 'మయన్మార్‌కు ఈ ఆకుపచ్చ నెమలి జాతీయపక్షి ఇవి ఆగ్నేయాసియా, కంబోడియా, వియత్నాం, చైనా, థాయిలాండ్‌, మయన్మార్‌లో నివసిస్తుంటాయి. మొత్తంగా చూసుకుంటే. సాధారణ నెమలికన్నా... ఇది ప్రత్యేకంగా, ఇంకా అందంగా కనిపిస్తుంది.

అంతరించిపోతున్నాయి!

ఈ ఆకుపచ్చ నెమళ్లు రానురాను అంతరించిపోతున్నాయి. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, మాంసం, ఈకల కోసం వేట వల్ల ఇలా జరుగుతోంది. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. 1995 ప్రాంతంలో వీటి సంఖ్య 5000గా ఉండేది. 2020నాటికి 1608 పరిమితమైందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండోనేషియా నెమళ్లు... మన దగ్గరి నెమళ్ల కన్నా... మౌనంగా ఉంటాయి. ఎక్కువగా శబ్దాలు చేయవు. ఆడ, మగ నెమళ్లు చూడ్డానికి కాస్త ఒకేలా ఉంటాయి. మన దగ్గరి నెమళ్లలా వేరువేరుగా ఉండవు. మగవి దాదాపు 1.8 నుంచి 8 మీటర్ల వరకు పొడవుంటాయి. వీటి తోకే దాదాపు రెండు మీటర్లు ఉంటుంది. ఆడవి 1 నుంచి 1.1 మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. ఆడ గ్రీన్‌ నెమళ్లు నేలపైనే గూడు కట్టుకుంటాయి. ఒక్కో పక్షి మూడు నుంచి ఆరు గుడ్లు పెడుతుంది.

ఏం తింటాయంటే...

ఇవి ఎక్కువగా పండ్లు, విత్తనాలు, పాములు, కప్పలు, ఇతర చిన్న చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. చెదపురుగులు, పువ్వులు, మొగ్గలు, ఆకులను కూడా తింటాయి. వీటి జీవితకాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. 3.8 నుంచి 5 కేజీల వరకు బరువు తూగుతాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఆకు పచ్చ నెమలి విశేషాలు భలే ఉన్నాయి కదూ!

Responsive Footer with Logo and Social Media