భలే.. భలే..బాతును నేను!
హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు. నేనైతే చక్కగా ఉన్నాను. మీరు కూడా బాగానే ఉన్నారని... ఉంటారని అనుకుంటున్నాను. ఇంతకీ నేను ఎవరిని అంటే.. ఒక పే...ద్ద బాతును. నాకు తెలిసి నన్ను ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. అందుకే నా విశేషాలు మీతో పంచుకుందాం అని... ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను.
నా పేరు వైట్ వింగ్డ్ డక్. వైట్ వింగ్ట్ వుడ్ డక్ అని కూడా పిలుస్తుంటారు. అంటే నేను తెల్ల రెక్కల బాతును అన్నమాట. పెద్ద బాతుల జాతుల జాబితాలో నేనూ ఉంటాను. నేను 66 నుంచి 81 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నా రెక్కలేమో 118 నుంచి 158 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. మాలో మగవాటి బరువు దాదాపు మూడు నుంచి నాలుగు కిలోల వరకు ఉంటుంది ఆడవాటి బరువేమో సుమారు రెండు నుంచి మూడు కిలోల వరకు ఉంటుంది.
నాకు నల్లటి శరీరం, తెల్లని మెడ ఉంటుంది. రెక్కల మీద కొన్ని తెల్లని ఈకలు ఉంటాయి. రాత్రి పూట మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాను. విత్తనాలు, నీటి మొక్కలు, బియ్యం, నత్తలు, చిన్న చిన్న చేపలు, ఇతర కీటకాలను తిని, నా బుజ్జి బొజ్జ నింపుకొంటాను. చెట్ల తొర్రల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాను. ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, సుమత్రా, లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా, మయన్మార్‌లో కనిపిస్తుంటాను. నేను ఒకప్పుడు జావా, మలేషియాలోనూ ఉండేదాన్ని. మరో విశేషం ఏంటంటే నేను అసోం రాష్ట్ర పక్షిని.
అరుదైన పక్షినోచ్!
పర్యావరణ మార్పులు, వాతావరణ కాలుష్యం, అడవుల నరకివేత, విపరీతమైన వేట కారణంగా మా జనాభా రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం నేను అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మా సంఖ్య 800 కంటే కూడా తక్కువగా ఉంది. భారతదేశంలో డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, దిహింగ్ పృట్రై. వన్యప్రాణుల అభయారణ్యం, నమేరి నేషనల్ పార్క్, నమ్ దఫా నేషనల్ పార్క్‌లో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!