ఈ బొద్దింక బుస కొడుతుందోచ్!
హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చింటూను. అప్పుడప్పుడు నాకు ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు చేసి ఆ విశేషాలు మీకు చెబుతూ ఉంటా ఓకేనా. ఈ రోజు నేను మీకు ఒక బొద్దింక వివరాలు చెప్పబోతున్నా. కానీ ఇది మామూలు జీవి కాదు... బుస కొట్టే బొద్దింక. ప్రపంచంలో ఇక ఏ బొద్దింక కూడా దీనిలా బుస కొట్టదు! మరి నా ప్రశ్నలేంటి, దానికి ఆ కాక్రోచ్ ఏం సమాధానాలు చెప్పిందో.. తెలుసుకోండి సరేనా!
చింటు: హాయ్ బొద్దింకా! బాగున్నావా... ఇంతకీ నీ పేరేంటి? నువ్వెక్కడ ఉంటావు?
బొద్దింక: హలో చింటూ...! నా పేరు మడగాస్కర్ హిస్సింగ్ కాక్రోచ్. నేను మడగాస్కర్‌లో మాత్రమే జీవిస్తాను.
చింటు: ఓ అవునా... గుడ్! నేస్తమా... నాకో అనుమానం. నువ్వు నిజంగా బుస కొడతావా? బొద్దింక: హుం... అవును చింటూ... నేను బుసలాంటి శబ్దాన్ని చేస్తాను.
చింటు: అవును... నీకు రెక్కలు లేవేంటి?
బొద్దింక: మీ దగ్గర ఉండే బొద్దింకల్లా మాకు రెక్కలు ఉండవు చింటూ! అందుకే మేం బుసకొడతాం. 'చింటు: నీకు రెక్కలు లేకపోవడానికి, బుసకొట్టడానికి సంబంధం ఏంటి? అదేంటో కాస్త వివరంగా చెబుతావా ఫ్రెండ్!
బొద్దింక ఓ తప్పకుండా... మామూలుగా బొద్దింకలకు రెక్కలుంటాయి. అవి వేగంగా పరుగులు పెట్టడమే కాదు... ఆపద సమయాల్లో తమ రెక్కలతో ఎగురుతాయి కూడా. కానీ మాకు రెక్కలు లేవు కదా... అందుకే మేం తేలిగ్గా మా శత్రువుల చేతికి చిక్కుతాం. అలా వాటికి దొరక్కుండా... మేం బుసకొడతాం అన్నమాట. ఆ శబ్దాన్ని విని మా శత్రువులు కాస్త భయానికి, గందరగోళానికి గురవుతాయి. ఆ సమయంలో మేం ఎంచక్కా పారిపోతాం.
చింటు: ఓ... నీకు రెక్కలు లేకపోవడం, బుసకొట్టడం వెనక ఇంత కథ ఉందన్నమాట. అది సరే కానీ... నువ్వేంటి మిగతా బొద్దింకలతో పోల్చుకుంటే కాస్త పెద్దగా కూడా కనిపిస్తున్నావు?
బొద్దింక: అవును చింటూ... కానీ రెక్కలు లేని బొద్దింక జాతులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే అవేవీ నాలా బుసకొట్టలేవు. ఇంకో విషయం ఏంటంటే. నేను అతిపెద్ద బొద్దింక జాతుల్లో ఒకదాన్ని. 5 నుంచి 1.5 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నీకు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాలా..! మమ్మల్ని మీ మనుషుల్లో కొందరు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు తెలుసా!
చింటు: ఏంటి... కుక్కలు, పిల్లుల్లా మిమ్మల్నీ పెంచుకుంటారా? అంటే మీరు పెంపుడు కీటకాలన్నమాట.. అంతేనా?
బొద్దింక: అవును మేం పెంపుడు కీటకాలం. మమ్మల్ని పెంచుకోవడమే కాదు... మాతో ఆడుకుంటూ కాలక్షేపం కూడా చేస్తుంటారు. దీనంతటికీ మేం 'హిస్..' అని చేసే శబ్దమే కారణం. అన్నట్లు నీకు చెప్పడం మరిచిపోయాను. నాకు మడగాస్కర్ హిస్సింగ్ కాక్రోచ్‌తో పాటు మరో పేరు కూడా ఉంది. బొద్దింక: నన్ను 'సింపుల్ హిస్సర్ అని కూడా పిలుస్తుంటారు. మమ్మల్ని గాజు తొట్లలో "పెంచుకుంటూ ఉంటారు. మేం వాటి నుంచి బయటకు వెళ్లిపోకుండా... ఆ గాజు తొట్లకు పైన కొన్ని అంగుళాల మందంతో పెట్రోలియం జెల్లీ రాస్తారు. అప్పుడిక మేం అందులోనే ఉండిపోతాం. అడవుల్లో అయితే ఎంచక్కా పాత కర్ర దుంగల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాం. మీ మనుషులు చీటికీ మాటికీ ఒకరితోఒకరు గొడవలు పడుతుంటారు. అసలు సరైన ఐకమత్యమే మీలో ఉండదు. కానీ... మేం అయితే అలా కాదు.
'చింటు: అవునా.. అదెలా..?
బొద్దింక: అవును చింటూ.. మేం అసలు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడం. ఎప్పుడూ గుంపులుగా ఉంటాం. మాలో మేం దాదాపు తగవులు పెట్టుకోం. నిత్యం ఎంతో ఐకమత్యంతో జీవిస్తాం. సరే చింటూ... ఈ ఇంటర్వ్యూ చాలిక. నేను వెళ్లాలి. నాకు కాస్త పని ఉంది.
చింటు: థ్యాంక్స్ సింపుల్ హిస్సర్... అడగ్గానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు! బై... బై...!!