భయపడకండి... నేనేమీ అనను!
హాయ్ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా! ఏంటి అలా చూసి, ఇలా వెళ్లిపోతున్నారు. హో... నాకు అర్ధమైంది, నా ఆకారం చూసి భయమేసింది కదూ! పర్లేదు... నేను మిమ్మల్ని ఏమీ అనను. ఎంచక్కా నా గురించి అన్ని వివరాలూ తెలుసుకొని అప్పుడు వెళ్లండి. ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి మరి!
నా పేరు 'బ్లూ ఐ బ్లాక్ లేమర్. దీని రూపం లాగానే పేరు కూడా వింతగా ఉందేంటి అనుకుంటున్నారా. ఆ రంగు, రూపం వల్లే... నాకు ఆ పేరు వచ్చింది. పిలవడానికి ఏమైనా కష్టంగా అనిపిస్తే... మీకు నచ్చినట్లు పిలవండి పిల్లలూ.. నాకేం పర్లేదు. ఎలా పిలిచినా.. పలుకుతా! ఇంతకీ నేను ఎక్కడుంటానో చెప్పలేదు కదూ.. నా స్వస్థలం ఆఫ్రికా. ఇంకా వేరే ఏ చోట నేను కనిపించను.
వేరుగా ఉంటాం...!
చూడటానికి కాస్త భయంకరంగా కనిపిస్తాము. మాలో మగ లేమర్ల శరీరం నలుపు, ఆడ వాటి శరీరం బ్రౌన్ రంగులో ఉంటుంది. కళ్లు మాత్రం అన్నింటికీ లేత నీలం రంగులో ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. మా చేతులు మీ మనుషుల చేతుల్లానే ఉంటాయి. అందుకే అలవోకగా చెట్లు ఎక్కేయగలం. అన్నట్టు మాలో చాలా రకాలే ఉంటాయి. అందులో మమ్మల్ని... 2008లో గుర్తించారు. మేము రాత్రి, పగలు ఏ సమయంలోనైనా చురుగ్గా ఉంటాం.
హాని చేయం...!
భయంకరంగా కనిపిస్తున్నాం కదా... అని జంతువులను వేటాడతాం అనుకోకండి నేస్తాలూ... పండ్లు, ఆకులు, దుంపలు తిని మా బొజ్జ నింపుకుంటాం. ఇతర జీవులకు అస్సలు హాని తలపెట్టం. తలకిందులుగా వేలాడుతూనే... మేం ఆహారం తింటాం. మీకో విషయం తెలుసా... మా శరీరం కంటే తోక పొడవే ఎక్కువ. శరీరం 39 నుంచి 45 సెంటీ మీటర్ల పొడవు ఉంటే. తోక 51 నుంచి 65 సెంటీ మీటర్ల పొడవు ఉంటుంది. నా బరువు దాదాపు 1.8 నుంచి 1.9 కిలోలు ఉంటుంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలను. సాధారణంగా అయితే 20 ఏళ్లు... రక్షణ కల్పిస్తే... 25 సంవత్సరాల వరకు జీవిస్తాను. మేము అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరిపోయాం. ప్రస్తుతం మా సంఖ్య 1000కి తగ్గింది. ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ... పిల్లలూ... ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, బయట తిరగకుండా ఎంచక్కా ఇంట్లో ఉండి ఆడుకోండి సరేనా..బై ఫ్రెండ్స్!