భలే... భలే... వింత జీవి!



దోసకాయ కాని దోసకాయ!సముద్ర దోసకాయ... ఇది! గులాబి రంగులో ఉంటుంది లోతైన జలాల్లో జీవిస్తుందిశీరమేమో పారదర్శకం! తీరేమో చిత్రవిచిత్రం... చదవండి మరి ఈ కథనం... తెలియాలంటే ఈ వింతజీవి నైజం!

ఎనిష్నియాస్టైస్‌, పింక్‌ సీ- త్రూ ఫాంటాసియా... ఇవే సముద్ర దోసకాయ జాతికి చెందిన ఆ వింతజీవి పేర్లు. పలకడానికి కష్టంగా ఉంది కదూ! హెడ్‌లెస్‌ చికెన్‌ ఫిష్‌, హెడ్‌లెస్‌ చికెన్‌ మాన్‌స్టర్‌, స్పానిష్‌ డాన్సర్‌, స్విమ్మింగ్‌ సీ కుకుంబర్‌ అని కూడా పిలుస్తారు.

రంగే... హంగు!

దీని రంగే దీని ప్రత్యేకత. గులాబీ వర్ణంలో పారదర్శకంగా ఉంటుంది. 11 నుంచి 25 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. వీటిలో పెద్ద జీవులు ఎరుపు గోధుమరంగులో ఉంటాయి. ఇవి పాక్షిక్ర పారదర్శకంగా మారతాయి. ఈ జీవుల పేగులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి ఏమైనా ఆహారం తీసుకున్న తర్వాత దీని శరీరం లోపలి భాగాలు చక్కగా అగుపిస్తాయి. అప్పుడు దీని జీర్ణక్రియ మొత్తాన్నీ వీక్షించవచ్చు!

చకచకా తినేస్తాయి!

ఇవి ఆహారం తీసుకోవడానికి చాలా తక్కువ సమయాన్ని వాడుకుంటాయి. కేవలం అరవైనాలుగు సెకన్లలోనే తన పొట్టనింపుకొంటాయి. శత్రువుల బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికే ఇది ఇలా చేస్తుందని పరిశోధకులు తేల్చారు.

అట్టడుగున హాయిగా...

చూడ్డానికి కాస్త జెల్లీఫిష్‌లా కనిపించే, ఈ జీవులు తమ టెంటకిల్స్‌ సాయంతో ప్రయాణిస్తాయి. అప్పుడు ఇవి విచ్చుకున్న పువ్వుల్లా కనిపిస్తాయి. ఇవి సముద్రాల్లో దాదాపు 2,500 మీటర్ల లోతున హాయిగా జీవిస్తాయి. నిజానికి వీటి ఉనికి బాహ్య ప్రపంచానికి 2001లోనే తెలిసింది. అప్పుడు సముద్ర పరిశోధకుల బృందానికి కనిపించడంతో దీని గుట్టు రటైంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఈ విచిత్ర జీవి విశేషాలు. మీకు నచ్చాయి కదూ!

Responsive Footer with Logo and Social Media