నేనూ డాన్స్ చేస్తా!
హాయ్ నేస్తాలూ! ఏంటి అలా చూస్తున్నారు? 'హో..! ఈ పక్షి ఇలా విచిత్రంగా ఉంది. ఎక్కడైనా రంగులు అంటించుకొని ఉంటుంది' అనుకుంటున్నారా? కానీ కాదు..! నేను ఉండటమే ఇలా ఉంటాను. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ నన్ను చూసి ఉండరు కాబట్టి... అలా అనిపిస్తుంది అంతే! ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదూ!
నన్ను 'సూపర్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని పిలుస్తారు. చూడటానికి వింతగా ఉండటం వల్ల అలా పిలుస్తారన్నమాట. 'వొగెల్‌కాప్ లోఫోరినా' కూడా నా పేరే. నేను గునియా దేశానికి చెందిన పక్షిని. ఇతర ఏ దేశాల్లోనూ కనిపించను. మాలో ఆడ, మగ పక్షులను ఇట్టే గుర్తుపట్టేయొచ్చు తెలుసా! మగ పక్షుల శరీరమంతా నలుపు రంగులో ఉంటుంది. కళ్లు, మెడ కింద రెక్కలాంటి భాగం నీలి రంగులో ఉంటాయి. ఆడవేమో.. బ్రౌన్ రంగులో ఉంటాయి.
నేను పండ్లు, కప్పలు, చిన్నచిన్న కీటకాలను ఇష్టంగా తింటాను. సీజన్‌ని బట్టి ఏ ఆహార్వాన్నైనా తీసుకుంటాను. కాబట్టి తిండికి పెద్దగా కష్టమేమీ ఉండదు నాకు. ఇప్పటి వరకు మీకు పక్షుల్లో నెమలి మాత్రమే... డాన్స్ చేస్తుందని తెలుసు. కానీ మాలో మగ పక్షులు చాలా బాగా డాన్స్ చేస్తాయి. మా పొడవు దాదాపు 28 సెంటీమీటర్లు. 5 నుంచి 8 సంవత్సరాల వరకు జీవించగలం. ఎక్కువగా వేటాడటం వల్ల మా జనాభా చాలా వరకు తగ్గిపోయింది. ఇవీ నా విశేషాలు మీకు నచ్చాయి కదూ!