భలే భలే ధీమ్ పార్...!
హాయ్ నేస్తాలూ..! చైనా అనగానే మనకు.. రకరకాల వింతలు విశేషాలూ గుర్తుకొస్తాయి.. కరోనా అక్కడి నుంచే వచ్చింది అంటారు కాబట్టి కాస్త భయం కూడా వేస్తుంది... కదా! అయినా ఇప్పుడు ఆ దేశం విషయాలు మనకెందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే. అక్కడున్న ఒక అద్భుతమైన పార్కు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాబట్టి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కథనం చదివేయండి. ఆ వివరాలేంటో మీకే తెలుస్తాయి!
ఒక్కరోజు సెలవు వచ్చినా చాలు సరదాగా పార్కులకు, ఎగ్జిబిషన్లకు తీసుకెళ్లమని అమ్మానాన్నలను అడుగుతూనే ఉంటాం. తీసుకువెళ్లేదాకా... మారాం చేస్తాం అంతే కదా! చైనాలో 'చిమెలాంగ్ స్పేస్‌షిప్' అనే ఒక పార్కు ఉంది. అది చాలా బాగుంటుంది. ఈ పార్కుకు ప్రతిరోజు వేలమంది పర్యాటకులు వస్తారట. ఇది సుమారు 8.81 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్వేరియం ఉందట. ఇంకో విషయం ఏంటంటే. అందులో దాదాపు 1.50 లక్షల సముద్ర ప్రాణులు ఉన్నాయట. అమ్మో! నిజంగా అన్ని జీవులు ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి పిల్లలూ.. ఇది నిజంగా నిజమే.
ఎన్నో రకాలు...!
ఈ ఒక్క పార్కునే 15 రకాల థీమ్‌లతో ఏర్పాటు చేశారు. అన్నట్లు దీన్ని లాస్‌ఏంజెల్స్‌కి చెందిన లెగసీ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు డిజైన్ చేశారు. మీకో విషయం తెలుసా... ప్రాణాలతో ఉన్న అతిపెద్ద పగడపు దిబ్బలు ఈ పార్కులోనే ఉన్నాయట. వీటన్నింటితో పాటుగా.. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు, ఆహార పదార్థాలు అన్నీ అందుబాటులో ఉన్నాయట. ఇన్ని వింతలున్న పార్కును 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా గుర్తించి... 'వరల్డ్స్ లార్జెస్ట్ ఇండోర్ థీమ్ పార్క్' విభాగంలో రికార్డును అందించారు. ఈ పార్కుకు వెళ్లొచ్చిన వాళ్లంతా... అది మరో సముద్ర ప్రపంచం అని చెబుతున్నారు. ఈ పార్కు విశేషాలు భలేగా ఉన్నాయి కదా నేస్తాలూ!