మాటల్లో కాకపోతే... రాతలతో చెప్పొచ్చు!
హాయ్ నేస్తాలూ..! పుస్తకాలు రాయడం అంటే. హోంవర్క్ రాయడమంత సులభమేం కాదు. మనం ఆ హోంవర్క్ రాయడానికే నానాపాట్లు పడతాం. ఎలాగోలా ముగించి ఆడుకోవాలని చూస్తాం. అలాంటిది ఒక అంశం గురించి పుస్తకం రాయడం చాలా కష్టం కదా! "అయినా ఇదంతా మాకెందుకు... అవన్నీ పెద్దవాళ్లు చూసుకుంటారు" అనుకుంటున్నారు. కదూ! కానీ పిల్లలు కూడా రాయొచ్చని ఒక అక్కయ్య నిరూపించింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా...!
హరియాణాలోని సిర్సా ప్రాంతానికి చెందిన రుజ్‌హాన్ చౌదరీకి పదహారు సంవత్సరాలు. ప్రస్తుతం తను పదో తరగతి చదువుతోంది. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కథలు, ఇతర పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. అదే తను కూడా పుస్తకాలు రాసే దిశగా ఆలోచింపజేసిందట. తను చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే... చిన్న చిన్న కథలు రాసి, ఇంట్లో వాళ్లకు వినిపించేదట. తన ప్రతిభతో 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించింది.
చదువుతో పాటు...!
'మన రుజ్‌హాన్.. చదువులో కూడా ఎప్పుడూ ముందే ఉంటుందట. ఒక వైపు పరీక్షలకు సిద్ధమవుతూనే కథలు కూడా రాసేదట. అలాంటి సమయంలోనే మన మెదడు ఇంకా చురుగ్గా పని చేస్తుందని చెబుతోంది తను. ఇప్పటి వరకు ఈ అమ్మాయి రాసిన నాలుగు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వాటికి “ఫేసెస్ ఆన్ ది కాన్వాస్', 'మిస్స్‌డ్ ట్రీ అని పేర్లు పెట్టింది. అందులో కొన్ని కథలు, నవలలు రాసిందట. ప్రస్తుతం తను అయిదో పుస్తకం రాసే పనిలో ఉందట. 'నా చుట్టపక్కల జరిగే సంఘటనలనే అక్షరాలుగా రాస్తున్నాను. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు రాతల రూపంలో సమాజానికి తెలియజేయవచ్చు. నాకు రాయడంతో పాటుగా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తి' అని చెబుతోంది రుజ్‌హాన్. తన పుస్తకాలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంతైనా రుజ్‌హాన్ చాలా గ్రేట్ కదూ.. మరి మనమూ తనకు “ఆల్ ది బెస్ట్' చెప్పేద్దామా...!