ఇది గులాబీ చందనం
ఎర్రచందనం తెలుసు.. ఏంటీ ఈ గులాబీ చందనం అనుకుంటున్నారు కదూ! దీని పేరు పింక్ ఐవరీ. దీన్ని పర్పుల్ ఐవరీ, రెడ్ ఐవరీ, ఉమ్మిని అని కూడా పిలుస్తుంటారు. ఇది ఎర్రచందనం కంటే ఖరీదైన కలప! ఈ చెట్లు ఎక్కువగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే, మొజాంబిక్, ఉత్తర బోట్స్‌వానాలో పెరుగుతుంటాయి.
ఈ పింక్ ఐవరీ కలప చాలా గట్టిగా ఉంటుంది. దీనికి రుచికరమైన పండ్లు కూడా కాస్తాయి. కానీ ఈ చెట్టు మాత్రం కలపకే ప్రసిద్ధి. అలాగే దీని బెరడులాంటి ఇతర భాగాల్లో జౌషధ గుణాలున్నాయని స్థానికులు నమ్ముతుంటారు. అందుకే వీటిని సంప్రదాయ వైద్యంలోనూ ఉపయోగిస్తుంటారు.
పింక్ ఐవరీ ఆఫ్రికాకు చెందిన జులు ప్రజల రాజవృక్షం. గతంలో కేవలం రాజకుటుంబీకులే ఈ కర్రతో తయారైన వస్తువులు, ఆభరణాలు వాడేవారట. 1888లో జులులాండ్ బ్రిటిష్ వారి 'వశమయ్యేంత వరకు ఈ సంప్రదాయమే కొనసాగిందట. ప్రస్తుతం మాత్రం దీని కలప అత్యంత విలువైనది, అరుదైనది. అందుకే దక్షిణాఫ్రికాలో దీన్ని ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పింక్ ఐవరీ చెట్లను నరకడానికి అనుమతిస్తున్నారు.
ఈ కలపను ఖరీదైన కత్తుల హ్యాండిల్స్, బిలియర్డ్స్‌లో ఉపయోగించే కర్రలు, చెస్ కాయిన్స్, నగలు, చిన్న చిన్న పెట్టెల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ చెక్కను చక్కగా చెక్కి, అలంకరణ కోసమూ వాడుతుంటారు. ఫ్రెండ్స్... మొత్తానికి ఇవీ ప్రపంచంలో అత్యంత అరుదైన, విలువైన గులాబీ చందనం, అదే నేస్తాలూ... పింక్ ఐవరీ విశేషాలు. మొత్తానికి భలే ఉన్నాయి కదా! మీకు నచ్చాయి కదూ!