ఇవి అలలు చెక్కిన శిలలు!



నేస్తాలూ... మనందరికీ సముద్రం అన్నా... అలలన్నా భలే ఇష్టం కదూ! ఈ సముద్రపు అలలకు విపరీతమైన శక్తి ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి కొన్ని ప్రకృతి వింతలను కూడా సృష్టిస్తాయి. ఇప్పుడు మనం అలాంటి ఓ అద్భుతం గురించి తెలుసుకుందాం... సరేనా!

ఒకదానిపై మరోటి పేర్చినట్లుగా ఉన్న ఈ రాళ్లను పాన్‌కేక్‌ రాక్స్‌ అని పిలుస్తారు. ఇవి న్యూజిలాండ్‌లో ఉన్నాయి. పాపరోవా నేషనల్‌ పార్క్‌కు సమీపంలోని పునకైకి గ్రామానికి ఆనుకుని కనువిందు చేస్తుంటాయి. వీటిని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.

కోట్ల సంవత్సరాలకు పూర్వం...

ఈ పాన్‌కేక్‌ రాక్స్‌ కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఏర్పడ్డాయి. ఈ సముద్రంలోని జీవులు చనిపోయిప్పుడు వాటి పెంకులు, సమీపంలోని ద్వీపాల నుంచి ఇసుక, మట్టి కలిసి అడుగుకు చేరాయి. ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాలపాటు జరిగింది. చివరికి మందపాటి కాల్షియం కార్బోనేట్‌ నిక్షేపంలా ఏర్పడింది. ఇదంతా సముద్రమట్టం కన్నా కొన్ని అడుగులపైకి చేరుకుంది. ఈ సున్నపురాయి కాలక్రమేణా సముద్ర కోతకు గురై ఇప్పుడున్న ఆక్ళతులు వచ్చాయి.

అబ్బురపరిచే బ్లో హోల్స్‌...

సున్నపురాయి ఇలా కోతలకు గురైనప్పుడు కొన్ని చోట్ల బ్లో హోల్స్‌ ఏర్పడ్డాయి. అంటే సముద్రం అలలు ఈ రాయికి కింద నుంచి రంధ్రాలు చేశాయి. అవి ఒక రకమైన గుహల్లా తయారయ్యాయి. సముద్రం అలలు ఈ గుహల గుండా ప్రయాణించినప్పుడు నీరు పైకి ఎగజిమ్ముతుంది. నీరు వెళ్లిపోగానే... మళ్లీ గాలితో నిండుతుంది. తిరిగి నీరు రాగానే గాలి ఒత్తిడితో కొన్ని అడుగుల ఎత్తు వరకు ఎగజిమ్ముతుంది. ఇలా ఈ ప్రకృతి వింతను చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. అందుకే ఈ పాన్‌కేక్‌ రాక్స్‌ను వీక్షించడానికి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వాళ్లు నడిచి వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్న దారులు కూడా ఉన్నాయి. సందర్శకులు ఇక్కడ ఫొటోలు, సెల్ఫీలతో తెగ సందడి చేస్తుంటారు. నేస్తాలూ మొత్తానికి ఈ ప్రకృతి వింత భలేగా ఉంది కదూ!

Responsive Footer with Logo and Social Media