కోరల జింకను నేను!



హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. పొడవైన కోరలతో ఉన్న నన్ను చూసి ఏదో క్రూరమృగం అనుకుంటున్నారు. కదూ! కాదు. నేనో సాధుజంతువును... జింకను. మరి నా సంగతులేంటో తెలుసుకుంటారా!

నా పేరు వాటర్‌ డీర్‌. చైనాకు చెందిన జీవిని. ఉత్తర, దక్షిణ కొరియాల్లోనూ కనిపిస్తుంటాను. రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లోనూ కొద్ది సంఖ్యలో ఉన్నాం. సాధారణంగా మగ జింకలకు కొమ్ములుంటాయి. కానీ మాకు ఉండవు. ఇలా కొమ్ములు లేకుండా ఉన్న ఏకైక జింక జాతి మాదే . అలాగే కోరలతో ఉండే జింకలం కూడా మేమే. అన్నట్లు అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. మాలో ఆడవాటికి ఇలా పొడవైన దంతాలు ఏమీ ఉండవు.

'మా కోరలు దాదాపు 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. వీటిని తోటి జింకలతో పోరాడే సమయాల్లో ఆయుధాల్లా ఉపయోగిస్తాం. మాలో మగవి 18 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఆడ జింకలేమో సుమారు 11 కిలోల వరకు బరువు తూగుతాయి. మా తోకలు చాలా చిన్నగా ఉంటాయి. మేం ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే జీవిస్తుంటాం. అక్కడ నీటిలో పెరిగే గడ్డిజాతులను తింటాం. మేం చక్కగా ఈత కూడా కొట్టగలం తెలుసా. పర్యావరణ మార్పులు, అక్రమ వేట కారణంగా రోజురోజుకూ మా సంఖ్య వేగంగా పడిపోతోంది. ప్రస్తుతం మేం అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాబితాలో ఉన్నాం. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి. బై.. బై...!

Responsive Footer with Logo and Social Media