భలే... భలే... జీబ్రా ఫిష్‌!



హాయ్‌... బాగున్నారా ఫ్రెండ్స్‌, నేను మీ జీబ్రా ఫిష్‌ను. నా గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు! నన్నెప్పుడూ మీరు చూసి కూడా ఉండకపోవచ్చు. అందుకే నా విశేషాలు చెబుదామని ఇదిగో ఇలా 'మీ ముందుకు వచ్చాను.

నా పేరు డానియో రెరియో. నన్ను జీబ్రా ఫిష్‌ అని కూడా పిలుస్తారు. నా ఒంటి మీద ఉండే చారలు జీబ్రాను పోలి ఉంటాయి కాబట్టే నాకు ఆ పేరు వచ్చింది. నేనో మంచినీటి చేపను. భారతదేశం, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్లలో నేను నివసిస్తుంటాను. ఇండియాలో సట్లేజ్‌ నదీ పరివాహక ప్రాంతం నుంచి ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు నా ఉనికి ఉంది. గంగా, బ్రహ్మపుత్ర నదుల్లోనూ నేను జీవిస్తుంటాను. కేవలం నదులు, చెరువుల్లోనే కాదు.. అక్వేరియాల్లోనూ బతికేస్తాను. చారలతో అందంగా ఉంటాను కాబట్టే, నన్ను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. యునైటెడ్‌ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా, కనెక్టికట్‌, ఫ్లోరిడా, న్యూమెక్సికో ప్రజలు కూడా ఇష్టంగా తమ తమ అక్వేరియాల్లో నన్ను పెంచుకుంటూ ఉంటారు. కొలంబియా, మలేషియాలోనూ నా ఉనికి ఉంది.

బుజ్జి చేపనోచ్‌!

నేను చిన్న చేపను. అక్వేరియాల్లో నేను 4 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. అదే ప్రకృతి సిద్ధంగా పెరిగితే కేవలం 1.8 నుంచి 8.1 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఉంటాను. అక్వేరియాల్లో నా జీవితకాలం రెండు నుంచి మూడు సంవత్సరాలు మాత్రమే. అదే నదులు, చెరువుల్లో అయితే, అన్నీ అనుకూలిస్తే అయిదు సంవత్సరాల వరకు బతకగలను.

ఏం తింటామంటే...

మేం కీటకాలు, కీటకాల లార్వాలు, రొయ్యల్లాంటి చిన్న చిన్న జలచరాలను ఆహారంగా తీసుకుంటాం. మాలో మళ్లీ కొన్ని ఉపజాతులున్నాయి. మమ్మల్ని మీ మనుషులు ఎన్నో వైద్య పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌, హృదయ సంబంధ వ్యాధులు, అంటురోగాలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు ఇక ఉంటామరి.. బై.. బై...!

Responsive Footer with Logo and Social Media