తాతయ్య మాటతో…
హాయ్ నేస్తాలు..! ప్రతిరోజు మనకు ఇంట్లో, స్కూల్లో... పోషకాహారం తినాలని చెబుతూనే ఉంటారు. కానీ మనం ఏ మాత్రం చెవికెక్కించుకోము. అసలు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. కానీ... మనలాంటి ఓ చిన్నారి మాత్రం ఎన్నో పోషకాలు లభించే ధాన్యాలను సేకరించి.. రికార్డు సాధించింది. మరి తనెవరో తెలుసుకుందామా!
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా బొయిపరిగూడకు చెందిన హర్షిత ప్రియదర్శిని మహంతికి పదమూడు సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. తన చిన్నతనంలో వాళ్ల తాతయ్య... కొన్ని నాణేలు ఇచ్చి ఇవి అరుదుగా దొరుకుతాయని చెప్పారట. అప్పటి నుంచి వివిధ రకాల నాణేలు సేకరించాలని నిర్ణయించుకుందట. అలా 80 దేశాలకు చెందిన రెండువేల నాణేలు, 40 దేశాల స్టాంపులు సేకరించింది. కొన్ని రోజులకు ఆ ఆసక్తి కాస్త వ్యవసాయ రంగం వైపు మళ్లింది. వరి, రాగులు, వివిధ రకాల చిరుధాన్యాల సేకరణ ప్రారంభించింది. ఇప్పటి వరకు 100కు పైగా రాగులు, 150కి పైగా ఇతర ధాన్యాలు సేకరించింది. 2023లో దిల్లీలో జరిగిన జీ-20 సదస్సులో, భువనేశ్వర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మిల్లెట్స్ సదస్సులో వాటిని ప్రదర్శించి... రాష్ట్రపతి ద్రౌపది ముర్చు ప్రశంసలు పొందింది.
మన హర్షిత 2023లో కృషక్ రత్న హెచ్‌డీఎఫ్‌సీ, రెడ్‌ఎఫ్‌ఎమ్ తరపున 'ఐడియా యంగ్‌స్టార్స్'లో పాల్గొని రూ.250,000 బహుమానం అందుకుంది. అలాగే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, 2024లో దిల్లీలో వార్ ఇండియా తరపున 'జ్యువెల్స్ ఆఫ్ ఒడిశా'గా నిలిచింది. అంతరించిపోతున్న ధాన్యాలను సేకరించి అవి అందరికీ అందేలా కృషి చేయడమే తన లక్ష్యమట. ఎంతైనా ఈ చిన్నారి గ్రేట్ కదూ!